రెండో టెస్టును కూడా గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సొంతం చేసుకుంటుందనుకున్న భారత జట్టు చతికిలపడింది. రెండో టెస్టులో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన ప్రొటీస్ జట్టు చరిత్ర సృష్టించింది. వాండరర్స్ మైదానంలో ఓటమెరుగని టీమిండియాను మట్టికరిపించింది.
ఈ మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అతను లేకపోవడంతో కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. తొలి టెస్టులో ఓటమితో అతని కెప్టెన్సీ కెరీర్ ప్రారంభమైంది. ఈ విషయంపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు.
మ్యాచ్‌లో భారత జట్టు కచ్చితంగా విరాట్ కోహ్లీని మిస్ అయిందని చెప్పాడు. ఏడు వికెట్లతో సఫారీలు గెలిచారంటే భారత జట్టుపై పూర్తి ఆధిపత్యం కనబరిచినట్లేనని అన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకొని అప్పటి కప్పుడు అద్భుతమైన వ్యూహాలు రచించే సత్తా కోహ్లీకి ఉందని, ఇదే రెండో టెస్టులో టీమిండియాలో కొరవడిందని అభిప్రాయపడ్డాడు.
తానేమీ రాహుల్‌కు వ్యతిరేకం కాదని, కానీ తొలి టెస్టులోనే అతన్నుంచి అద్భుతాలు ఆశించలేమని పేర్కొన్నాడు. ‘‘నాకు కెప్టెన్ కోహ్లీ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. అతను టెస్టు మ్యాచ్‌లో కొన్ని అద్భుతాలు సృష్టించగలడు. అతనిలో ఏదో ఉంది. అందుకని నేను రాహుల్‌కు వ్యతిరేకమేమీ కాదు. కానీ ఇది అతనికి కెప్టెన్‌గా తొలి టెస్టే. కెరీర్లో అతను పెద్దగా కెప్టెన్సీ చేసింది లేదు’’ అని వివరించాడు.
అలాగే నాలుగో రోజు ఆటను అశ్విన్‌తో ప్రారంభించడం కూడా రాహుల్ వ్యూహాల్లో అనుభవలేమిని ఎత్తిచూపుతోందన్నాడు. వర్షం కారణంగా కవర్స్ కప్పి అంతసేపు ఉంచిన పిచ్‌పై రెండు వైపుల నుంచి పేసర్లతోనే దాడి చేయించి ఉండాల్సిందని సూచించాడు.
India surely missed the energy virat kohli brings on the field!!✨ #ViratKohli #INDvSA pic.twitter.com/hr8GyRYTug
— Unobtrusive_17🇮🇳 (@unobtrusive_178) January 7, 2022