బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంతవరకూ ట్రోఫీ గెలవకపోయినా అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ మళ్లీ నడిపించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2013 నుంచి తొమ్మిదేండ్ల పాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 2021లో తప్పుకున్న కోహ్లీ.. మళ్లీ వచ్చే సీజన్లో సారథ్య పగ్గాలు చేపట్టనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ రిటెన్షన్స్‌కు గురువారం (అక్టోబర్ 31) సాయంత్రంతో తెరపడనున్న నేపథ్యంలో ఆర్సీబీని గత మూడు సీజన్ల పాటు నడిపించిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్‌ను అతడి వయసు (40 ఏండ్లు) రీత్యా రిటైన్ చేసుకోవడం కష్టమేనని తెలుస్తోంది. మ్యాక్స్‌వెల్ వంటి హిట్టర్పైనా బెంగళూరు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో మళ్లీ కోహ్లీకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు బెంగళూరు వర్గాల సమాచారం. ఒకవేళ కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), శ్రేయాస్ అయ్యర్(కోల్‌కతా) వేలంలోకి వస్తే వారిలో ఎవరినో ఒకరిని దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించొచ్చన్న పుకార్లూ షికార్లు చేస్తుండగా అనూహ్యంగా కోహ్లీ పేరు తెరపైకి రావడం గమనార్హం. మరి ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రతిపాదనకు కోహ్లీ అంగీకరిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
పదేండ్ల విరామం తర్వాత తమ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వదులుకోనున్నట్టు సమాచారం. 2022 వేలానికి ముందు అయ్యర్‌ను కేకేఆర్ రూ. 12.25 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గతేడాది కోల్‌కతా టైటిల్ నెగ్గడంతో ఈసారి రిటెన్షన్ టాప్-1 పేరు (రూ. 18 కోట్లు) తనదే ఉండాలని అయ్యర్ పట్టుబట్టగా మేనేజ్మెంట్ అందుకు ‘నో’ చెప్పినట్టు తెలుస్తోంది. అయ్యర్‌తో పాటు గతేడాది మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న మిచెల్ స్టార్క్, స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్నూ ఆ ఫ్రాంచైజీ వేలానికి వదిలేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అయ్యర్‌ను రిటైన్ చేసుకోకపోయినా రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ద్వారా దక్కించుకోవాలనే భావనలో మేనేజ్మెంట్ ఉన్నట్టు కేకేఆర్ వర్గాలు చెబుతున్నాయి. రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రమణ్‌దీప్ సింగ్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోనున్నట్టు వినికిడి.
గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్ ఫ్రాంచైజీ కోసం తన వేతనాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాడు. టాప్-1 రిటెన్షన్‌గా కాకుండా టాప్-2 (రూ. 14 కోట్లు) ప్లేయర్‌గా ఉండేందుకు అతడు ఆమోదం తెలిపాడు. రషీద్ ఖాన్ మొదటి రిటెన్షన్‌గా ఉండనున్నాడు. సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ మిగతా జాబితాలో ఉన్నారు. జట్టు కోర్ గ్రూప్ కోసమే గిల్ తన వేతనాన్ని తగ్గించుకున్నట్టు టైటాన్స్ వర్గాలు తెలిపాయి.
గతేడాది ఫైనలిస్టులు సన్‌రైజర్స్ హైదరాబాద్.. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్‌రెడ్డిని రిటైన్ చేసుకోనున్నట్టు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మతీశ పతిరానతో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్‌గా మహేంద్రసింగ్ ధోనీని రిటైన్ చేసుకునేందుకు సిద్ధమైంది.