ముంబై: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ(Virat Kohli) దూరం కానున్నాడు. అతను తొడకండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో.. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 13వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీని ఎంపిక చేయడం లేదని తెలిసింది. తొడకండరాల నొప్పి వల్ల అతను వన్డే సిరీస్ ఆడకపోవచ్చు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
37 ఏళ్ల కోహ్లీ.. ఈ యేటి ఐపీఎల్లో 675 రన్స్ చేసి తన ఫిట్నెస్ చాటుకున్నాడు. ఈ సీజన్లో అతను ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు కొట్టాడు. అయితే ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు అతను అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు లోటే అవుతుంది. ఫిట్‌నెస్‌లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న అతను వన్డే సిరీస్ మిస్ కావడం చాలా అరుదైన అంశం. అయితే రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియదు. ఐపీఎల్లో రోహిత్‌కు కూడా తొడకండరాలు పట్టేసిన విషయం తెలిసిందే. అయినా అతన్ని భారత జట్టుకు తీసుకున్నారు.
టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న కోహ్లీ, రోహిత్‌లు.. వన్డేలపై దృష్టి పెట్టారు. అయితే వచ్చే ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆ ఇద్దరూ ఆడుతారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్‌తో లక్నోలో 17న రెండో వన్డే, చెన్నైలో 20న మూడో వన్డే జరగనున్నది.