టన్నులకొద్ది పరుగులు చేసినా.. వందలాది రికార్డులు బద్దలు కొట్టినా.. తనపై కొందరు ఫెయిల్యూర్ కెప్టెన్‌గా ముద్ర వేశారని విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. సారథిగా జట్టు దృక్పథాన్ని మార్చి కొత్తపుంతలు తొక్కించినా.. వరుస సిరీస్ విజయాలు సాధించినా.. కొందరు మాత్రం అవన్నీ మరిచి కేవలం ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదనే తనపై అక్కసు వెళ్లగక్కారని అన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు ఆరు వరల్డ్‌కప్‌లు అవసరమయ్యాయని గుర్తుచేసిన విరాట్.. తాను సాధించిన వాటితో సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నాడు. ఆర్సీబీ పోడ్కాస్ట్లో కోహ్లీ పంచుకున్న వివరాలు..
న్యూఢిల్లీ: దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘ కాలం భారత సారథిగా కొనసాగాడు. టెస్టు క్రికెట్లో మొదట టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన కోహ్లీ.. ఆ తర్వాత వన్డే, టీ20ల్లోనూ సారథ్యం వహించాడు. అతడి హయాంలో భారత జట్టు ఐదు సార్టు ‘టెస్టు చాంపియన్‌షిప్ గద’చేజిక్కించుకుంది. అయితే విరాట్ కెప్టెన్సీలో భారత జట్టు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (2017), వన్డే ప్రపంచకప్ (2019), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2021), టీ20 వరల్డ్‌కప్ (2021)లో కోహ్లీ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగగా.. నాలుగింట్లోనూ టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది. దీంతో కొందరు విశ్లేషకులు అతడిపై ఫెయిల్యూర్ కెప్టెన్‌గా ముద్ర వేశారు. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సారథిగా పెద్దగా విజయవంతం కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆర్సీబీ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ.. తన మనసులోని మాటలు వెల్లడించాడు. మెగాటోర్నీల్లో జట్టును సెమీఫైనల్, ఫైనల్ వరకు తీసుకెళ్లినా.. ట్రోఫీలు గెలువకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారిందని అన్నా డు. అయితే, ఆ విమర్శలను తాను పట్టించుకోనని తన నాయకత్వంలో జట్టు దృక్పథంలో వచ్చిన మార్పులకు గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.
ఆటగాడిగా గెలిచినా..
‘నాలుగు ఐసీసీ మెగాటోర్నీల్లో భారత జట్టుకు సారథ్యం వహించాను. వాటిలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలువకపోవడంతో నాపై ఫెయిల్యూర్ కెప్టెన్‌గా ముద్ర వేశారు. నేను మాత్రం ఆ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. మేం జట్టుగా ఏం సాధించాం. మా ఆటతీరులో వచ్చిన మార్పు ఎలాంటిది అనేది మాత్రమే నాకు తెలుసు. ఒక టోర్నమెంట్ నిర్దిష్ట కాలవ్యవధిలో జరుగుతుంది. కానీ, జట్టు ఆటతీరులో మార్పు అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అలా జరగాలంటే టోర్నీ గెలువడం కన్న ఎక్కువ మంది అవసరం. నేను ఆటగాడిగా ప్రపంచకప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ గెలిచాను. మీరు ఆ కోణంలో మాత్రమే చూస్తే.. తమ కెరీర్లో ఒక్కసారి కూడా ఐసీసీ టోర్నీ నెగ్గని ఎందరో గొప్ప ప్లేయర్లు ఉన్నారు’అని విరాట్ కోహ్లీ అన్నాడు. ధోనీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2013 చాంపియన్స్ ట్రోఫీలు నెగ్గిన భారత జట్టులో కోహ్లీ ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే.
ధోనీ మాటలే మంత్రాలు..
కష్టకాలంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనకు అండగా నిలిచాడని విరాట్ చెప్పుకొచ్చాడు. భార్య అనుష్క శర్మ, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కాకుండా.. మహీ ఒక్కడే తనపై నమ్మకముంచి ఎల్లప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించాడని కోహ్లీ పేర్కొన్నాడు. 2008 నుంచి 2019 వరకు పదకొండేళ్ల పాటు ధోనీతో కలిసి డ్రెసింగ్ రూమ్ పంచుకున్న విరాట్.. ఇదివరకు కూడా మహీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ‘ధోనీ ఇతరులకు పెద్దగా అందుబాటులో ఉండడు. నేను ఎప్పుడైనా మహీకి ఫోన్ చేస్తే.. 99 శాతం అతడు ఫోన్ ఎత్తడు. అతడు మొబైల్ ఎక్కువగా వినియోగించడు. అలాంటి వ్యక్తి నాకు రెండుసార్లు మెసేజ్ చేశాడు. ఫామ్ కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడి నుంచి వచ్చిన ఆ సందేశం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “నువ్వు బలంగా ఉండాలని అనుకున్నప్పుడు.. దృఢమైన వ్యక్తిగా కనిపిస్తున్నప్పుడు.. నువ్వు ఎలా ఆడుతున్నావ్? అని అడగడం ప్రజలు మర్చిపోతారు”అని ధోనీ చెప్పాడు. ఆ మాటలు నాపై మంత్రాలుగా పనిచేశాయి’ అని కోహ్లీ అన్నాడు.