బెంగళూరు : గతేడాది వెస్టిండీస్‌లో ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలలో తన భవిష్యత్‌పై స్పష్టతనిచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్‌తో పాటు కోహ్లీ ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చినా రోహిత్ దానిని కొట్టిపారేయగా తాజాగా కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికల గురించి తెలిపాడు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీని యాంకర్.. ‘మీ నెక్స్ బిగ్ స్టెప్ గురించి ఏమైనా హింట్ ఇస్తారా’ అని అడిగింది. దానికి కోహ్లీ స్పందిస్తూ.. ‘నిజంగా నాక్కూడా తెలీదు. బహుశా తర్వాతి వన్డే ప్రపంచకప్ గెలవడమేమో!’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.