ముంబై: వివిధ కేటగిరీల్లోని క్రికెటర్లకు బీసీసీఐ ప్రతి ఏడాది శాలరీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏ ప్లస్ జాబితాలో ఉన్న క్రికెటర్లకు అత్యధికంగా ఏడు కోట్ల జీతం ఇస్తారు. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్ల జాబితాను ఏప్రిల్ 2025లో రిలీజ్ చేస్తారు. ఇక రాబోయే సంవత్సరానికి చెందిన కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఏ ప్లస్ కేటగిరీలో జీతం తీసుకుంటున్న ప్రఖ్యాత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. ప్రస్తుతం టెస్టులు, టీ20ల నుంచి ఆ ఇద్దరు మేటి క్రికెటర్లు తప్పుకున్నారు. వాళ్ల కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. దీని వల్ల సెంట్రల్ కాంట్రాక్టులోని కేటగిరీల్లో మార్పు జరిగే అవకాశం ఉన్నది.
బీసీసీఐ నాలుగు కేటగిరీల ప్రకారం క్రికెటర్లకు జీతాలు చెల్లిస్తుంది. అత్యధిక శాలరీలు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు అందుతుంది. ఇక ఆ తర్వాత స్థానాల్లో ఏ, బీ, సీ కేటగిరీ క్రికెటర్లు ఉంటారు. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మ ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. కానీ ఇటీవల వాళ్లు టెస్టు, టీ20లకు దూరం కావడం వల్ల .. ఆ క్రికెటర్ల గ్రేడింగ్ తగ్గే అవకాశం ఉన్నది. ఏ ప్లస్ కేటగిరీ నుంచి ఆ ఇద్దరూ ఏ కేటగిరీలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఆ డిమోషన్ వల్ల వాళ్ల శాలరీల్లో ఒక్కొక్కరికి రెండు కోట్ల కోత పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాంట్రాక్టులో ఉన్న ప్లేయర్లకు.. మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా పేమెంట్ చేస్తారు. అయితే శాలరీకి అదనంగా మ్యాచ్ ఫీజును అందిస్తారు.
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవల టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ అతను టెస్టు జట్టులో ఉన్నాడు. దీంతో అతను ఏ ప్లస్ కేటగిరీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏ ప్లస్ కాంట్రాక్టు జాబితా ప్లేయర్లకు ఏడు కోట్లు శాలరీ ఇవ్వగా, ఏ కేటగిరీ ఆటగాళ్లకు 5 కోట్లు మాత్రమే ఇస్తారు.