Team India | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : గడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆ ఇద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే దూకుడే పరమావధిగా బౌలర్లపై విరుచుకుపడే స్వభావం ఒకరిదైతే ప్రపంచంలో పిచ్, బౌలర్‌తో సంబంధం లేకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ఆధునిక క్రికెట్లో మేటి బ్యాటర్‌గా ఎదిగిన ఆటగాడు మరొకరు. కానీ ఈ ఇద్దరూ కొంతకాలంగా భారత బ్యాటింగ్‌కు మార్గదర్శులుగా ఉండాల్సింది పోయి జట్టుకు భారంగా మారుతున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు సారథి రోహిత్ శర్మ, పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి కంటే ఈ ఇద్దరి ఆటతీరే భారత క్రికెట్ అభిమానులను అత్యంత ఆందోళనకు గురిచేస్తోంది. జట్టు ఓటమిని ఒకరిద్దరి మీదకు నెట్టడం సరైనది కాకపోయినా సుదీర్ఘ అనుభవం కలిగిన ఈ ద్వయం వైఫల్యం భారత ఓటమికి ప్రధాన కారణం అని చెప్పక తప్పదు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రోహిత్.. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 15.17 సగటుతో 91 పరుగులు చేస్తే కోహ్లీ 15.53 సగటుతో 93 పరుగులు చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌లలో రోహిత్ స్కోర్లు 6, 5, 23, 8, 23, 2, 52, 0, 8, 18, 11 గా ఉంటే కోహ్లీ 6, 17, 47, 29, 0, 70, 1, 17, 4, 1 చేశాడు. వీరి వైఫల్యాన్ని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. స్పిన్‌ను బాగా ఆడగలిగే ఈ ఇద్దరూ గత మూడు మ్యాచ్‌లలోనూ దారుణంగా చతికిలపడ్డారు. గిల్, జైస్వాల్, పంత్ వంటి కుర్రాళ్లు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటుంటే ఈ ఇద్దరు మాత్రం పదే పదే తమ బలహీనతలను బయటపెడుతూ అత్యంత చెత్త షాట్లతో పెవిలియన్‌కు చేరారు. వాస్తవానికి ఈ టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంక చేతిలో ఆడిన రెండు టెస్టులూ ఓడి భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్ స్పిన్నర్లు అక్కడ తేలిపోయారు.
పూణె టెస్టులో మాత్రమే ఆడినా మిచెల్ శాంట్నర్‌తో పోల్చితే అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ అంత ప్రమాదకరమైన స్పిన్నర్లు కాకపోయినా వీళ్ల బౌలింగ్‌నూ ఎదుర్కోవడానికి రోహిత్, కోహ్లీ తంటాలు పడ్డారు. బోర్డర్ గవాస్కర్ వంటి కీలక సిరీస్‌కు ముందు జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఈ ఇద్దరి దారుణ వైఫల్యంతో వీరి భవితవ్యం కూడా ప్రమాదంలో పడింది. విదేశీ గడ్డపై చతికిలపడ్డా చూసీ చూడనట్టు వదిలేసే అభిమానులు ఏండ్లకేండ్లుగా ఆడుతున్న సొంతగడ్డపై ఇంత బాధ్యతారాహిత్యంగా ఆడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఇద్దరిపై నెట్టింట ట్రోలింగ్ పతాకస్థాయికి చేరింది. ‘రోకో’ గౌరవంగా జట్టు నుంచి తప్పుకుంటే మంచిదని, ఆస్ట్రేలియాలో కూడా ఇదే పునరావృతమైతే వారిపై వేటు వేసి యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.