IIT Baba | చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సమరం అభిమానులను మరోమారు అలరించింది. కోట్లాది మంది జనాలు ప్రత్యక్షంగా వీక్షించిన పోరులో దాయాది పాక్‌పై భారత్‌దే పైచేయి అయ్యింది. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను పాతరేస్తూ టీమ్ఇండియా విజయపతాకాన్ని ఎగురవేసింది. ఆల్‌రౌండ్ షో తో పాక్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమ్ఇండియా.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలవదంటూ ఐఐటీ బాబా (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. ‘ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే’ అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
I want to publicly apologize and ask each one of you all to celebrate,it’s party time… Mujhe man hi man pata tha ki india jetega.😉#IITianBaba #INDvsPAK #ChampionsTrophy #ViratKohli #ViratKohli𓃵 #ChampionsTrophy2025 pic.twitter.com/QHozGNzfmF
— Abhay Singh (IIT BOMBAY) (@Abhay245456) February 23, 2025
కాగా, దుబాయ్ వేదికగా ఆదివారం పాక్-భారత్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను పాతరేస్తూ టీమ్ఇండియా విజయపతాకాన్ని ఎగురవేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేసిన భారత్.. దుబాయ్‌లో భారీ విజయంతో మెగాటోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కుల్దీప్, హార్దిక్ వికెట్ల వేటతో పాక్ 241 పరుగులకే పరిమితమైంది. లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్‌శర్మ ఆదిలోనే నిష్క్రమించినా విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయి ఆడే రన్మిషీన్, ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (111 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగి మరో మరుపురాని ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే పూర్తిచేసింది. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56, 5 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46, 7 ఫోర్లు) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62, 5 ఫోర్లు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46, 3 ఫోర్లు) ఆదుకోవడంతో పోరాడగలిగే స్కోరును సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/40), హార్దిక్ పాండ్యా (2/31), జడేజా (1/40) పాక్‌ను కట్టడిచేశారు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతరించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈ ఐఐటీ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.
ఐఐటీ బాబా అభయ్ సింగ్‌ది హర్యానా రాష్ట్రం. శాస్త్ర, సాంకేతిక జీవితాన్ని వదిలేసి ఆయన.. ఆధ్మాత్మిక లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన్ను ఇంజినీర్ బాబా అని కూడా పిలుస్తారు. ఐఐటీ బాబా జీవిత జర్నీ ఓ విశేషమైంది. ఫోటోగ్రాఫీ, ఆర్ట్స్ పట్ల ఫోకస్ పెట్టడానికి ముందు బాంబేలో నాలుగేళ్ల పాటు ఉన్నాడు ఆ బాబా. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ జాబ్ కూడా సంపాదించాడు. కార్పొరేట్ కంపెనీలో కొన్నేళ్లు పనిచేశాడు. ఆ జాబ్‌ను తొందరగా వదిలేశాడు.
ట్రావెల్ ఫోటోగ్రఫీని అతిగా ఇష్టపడే ఐఐటీ బాబా.. ఇంజినీరింగ్ లైఫ్ స్టయిల్‌కు బ్రేకప్ చెప్పేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ కోర్సును పూర్తి చేసి ఆ తర్వాత తన జీవిత గమనాన్ని మార్చుకున్నాడు. జీవితం పట్ల ఉన్న తత్వ బోధన మారిందన్నాడు. కొన్ని రోజుల ఆయన విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో కోచింగ్ ఇచ్చాడు. అకాడమీలో సక్సెస్ సాధించినా.. జీవితంలో అతనికి సంతృప్తి దొరకలేదు. దీంతో అతను ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. ఆధ్యాత్మిక నిజాలను అర్థం చేసుకునేందుకు మరింత లోతుగా తన జీవితాన్ని అంకితం చేశాడు.
శివుడిని ఆరాధించే ఐఐటీ బాబా.. ఇప్పుడు ఆధ్యాత్మికతను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపాడు. లోతుగా వెళ్లిన కొద్దీ.. సర్వం శివమయం అని తెలుస్తోందన్నాడు. శివుడే వాస్తవమని, శిశుడు అద్భుతమన్నాడు. ఇంగ్లీష్ భాషలో మంచి పట్టు ఉన్న ఐఐటీ బాబా.. మహాకుంభ్‌కు వస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికతను కలిపి అతను భక్తులను పలకరిస్తున్నాడు.
అభయ్ సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మెడిటేషన్, యోగా, ప్రాచీన సూత్రాలు, ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటాడు. మహాకుంభ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, మనస్సుకు శాంతిని ఇచ్చిందన్నాడు.
Also Read..
Champions Trophy | విరాట్ విశ్వరూపం.. చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్?
PM Modi | ఊబకాయంపై పోరాటం.. వంటనూనె వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ