Vinesh Phogat : భారత రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు రోజురోజుకు మద్ధతు పెరుగుతోంది. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజేశ్ కుమార్(Brijesh Kumar)పై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కిన వాళ్లకు రాజకీయ నాయకులు, క్రికెటర్లు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న వినేశ్ ఫోగట్(Vinesh Phogat) ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకు ఆమెకు ఇంత ధైర్యం ఎక్కడిది? అని అనుకునేవాళ్లూ లేకపోలేదు.
వినేశ్ ఫోగట్ ధైర్యం, పోరాడేగుణం, ముక్కుసూటి తత్వం వెనుక ఆమె తల్లి జీవితం ఉంది. ధైర్యంగా నిలబడడం, తప్పుని వేలెత్తి చూపడం వంటి లక్షణాలన్నీ తనకు అమ్మ నుంచి అలవడ్డాయని వినేశ్ తెలిపింది. అంతేకాదు తాము ఈరోజు మాట్లాడకుంటే తమ అమ్మ పడిన కష్టాలన్నీ వృథా అవుతాయని ఆమె అంది.
‘మానాన్న చనిపోయే సరికి అమ్మ ప్రేమ్ లతా ఫోగట్(Prem Lata Phogat) వయసు 32 ఏళ్లు. వితంతువుగా మమ్మల్ని పోషించేందుకు అమ్మ ఎన్నో కష్టాలు పడింది. అక్షరం ముక్క రాని అమె సమాజం ఛీదరింపులను, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొంది. ఇన్ని కష్టాలు చాలదన్నట్టు ఆమెను క్యాన్సర్ పరీక్షించింది. అయినా ధైర్యంగా పోరాడింది. మహిళా రెజ్లర్లకు జరిగిన అన్యాయాన్ని ఇప్పటికీ ప్రశ్నించకుంటే.. ఈ విషయంపై మాట్లాడకుంటే మా అమ్మ పడ్డ కష్టాలకు విలువ ఏముంటుంది?’ అని వినేశ్ వెల్లడించింది.
తల్లి ప్రేమ్ లతా ఫోగట్‌తో వినేశ్ ఫోగట్
రెజ్లర్ల ఆందోళన దేశం దృష్టిని ఆకర్షించడం వెనక వినేశ్ ఫోగట్ ఉంది. మీడియాతో మాట్లాడడం మొదలు, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆమె విజయవంతమైంది. మేము పతకం గెలిచినప్పుడు ప్రశంసించే మీరు ఇప్పుడు మౌనంగా ఉంటే ఎలా? అని క్రికెటర్లను ప్రశ్నించిన తీరు అందరినీ ఆలోచనల్లో పడేసింది. వినేశ్ ఫోగట్ ప్రశ్నతో క్రికెటర్లలో కదలిక వచ్చింది. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. ఇలా ఒక్కొక్కరుగా పెదవి విప్పారు. రెజ్లర్లకు మద్దతు తెలిపారు. మహిళా రెజ్లర్లపై లైగింక దాడికి పాల్పడిన బ్రిజేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.