బలాలి (హర్యానా): భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటాన్ని వీడేది లేదని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరోసారి స్పష్టం చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల అదనపు బరువు వల్ల తృటిలో పతకం కోల్పోయి స్వదేశానికి చేరుకున్న ఆమె తన స్వంత గ్రామం బలాలికి చేరుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇంకా ముగిసిపోలేదు.
ఎప్పటికైనా నిజం గెలుస్తుంది’ అని తెలిపింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణతో గతేడాది రెజ్లర్లు చేపట్టిన పోరాటానికి వినేశ్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో పతకం రాకపోవడం తీవ్రంగా నిరాశపరిచినా తన గ్రామస్థులు, దేశ ప్రజలు చూపించిన ప్రేమతో ఆ గాయాన్ని కాస్తైనా మరిచిపోతున్నానని వినేశ్ చెప్పింది.