బెంగళూరు: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (సుమారు రూ. 16,500 కోట్లు) పలికిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకంపై ఈ ఫ్రాంచైజీ మొదటి యజమాని విజయ్ మాల్యా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 2008లో తాను రూ. 450 కోట్లు పెట్టి బెంగళూరు ఫ్రాంచైజీని కొనుగోలు చేసినప్పుడు తనను చూసి అంతా నవ్వారని, కానీ ఇప్పుడు ఆర్సీబీ విలువ ఏకంగా 37 రెట్లు పెరిగి ఒక బ్రాండ్‌గా ఎదగడం ఎంతో తృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా మాల్యా స్పందిస్తూ.. ‘ఆర్సీబీ కొత్త ఓనర్లకు శుభాకాంక్షలు.
2008లో ఈ ఫ్రాంచైజీలో రూ. 450 కోట్లు పెట్టుబడులు పెట్టినప్పుడు నన్ను చూసి చాలా మంది నవ్వారు. ఇదో ఆడంబరమైన ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాయల్ చాలెంజ్ బ్రాండ్‌ను నిర్మించాలనే బలమైన ఉద్దేశముంది. అందుకే ఈ ఫ్రాంచైజీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని పేరు పెట్టాను. ఇప్పుడు దాని విలువ రూ. 450 కోట్ల నుంచి రూ. 16,500 కోట్లకు పెరుగడం తృప్తినిచ్చింది. ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అయిన నాటి యువ విరాట్ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేసుకోవడం కూడా ఇందులో భాగమే’ అని రాసుకొచ్చాడు.
పేరు మారదు: అనన్య
ఆర్సీబీ యాజమాన్యం చేతులు మారుతున్న వేళ.. ఆ జట్టు పేరు మారుతుందా? అని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆదిత్యా బిర్లా గ్రూప్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఆ గ్రూప్‌నకు చెందిన అనన్య బిర్లా ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘ఆర్సీబీ పేరు మారదు’ అని తెలిపింది.