బెంగళూరు: విజయ్ హజారే వన్డే టోర్నీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం విదర్భ, సౌరాష్ట్ర మధ్య ఫైనల్ జరుగనుంది. టోర్నీలో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఇరు జట్లు టైటిల్‌పై కన్నేశాయి. సౌరాష్ట్ర ముచ్చటగా మూడో టైటిల్ వేటలో బరిలోకి దిగుతుండగా, విదర్భ తొలిసారి కప్‌ను ముద్దాడాలన్న పట్టుదలతో ఉంది. ఈ రెండు జట్లలో పెద్దగా స్టార్లు లేకపోయినా మేటి టీమ్‌లకు దీటైన పోటీనిస్తూ తుదిపోరులో నిలిచాయి.
ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్లు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అదరగొడుతున్నారు. పంజాబ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో విశ్వరాజ్ జడేజా సూపర్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ హర్విక్ దేశాయ్ 561 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు అమన్ మోఖడే(781) విదర్భ తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. అమన్‌కు తోడు ధృవ్ షోరె(515) చెలరేగుతుండటంతో విదర్భ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంది.
టాపార్డర్‌లో ఈ ఇద్దరు నిలకడగా రాణిస్తుంటే మిడిల్లో రవికుమార్ సమర్థ్(427) మెరుగ్గా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ వరకే పరిమితం కాకుండా సౌరాష్ట్రకు పేసర్లు అంకుర్ పన్వర్(21), చేతన్ సకారియా(15) కీలకంగా మారగా, విదర్భ తరఫున నచికేత్ భట్(15), యశ్ ఠాకూర్(15) అదరగొడుతున్నారు. మొత్తం గా సమవుజ్జీల మధ్య పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.