KSCA | కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA)కు జరుగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ పోటీ చేయనున్నారు. అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తదితర దిగ్గజ ఆటగాళ్లు వెంకటేశ్ ప్రసాద్‌కు మద్దతు ప్రకటించారు. కేఎస్‌సీఏ ఎన్నికలు ఈ నెల 30న జరుగనున్నాయి. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ప్రస్తుత కమిటీ అధ్యక్షుడు రఘురామ్ భట్ పదవీకాలం గత సెప్టెంబర్ 30తో ముగిసింది. వెంకటేశ్ ప్రసాద్ విలేకరుల మాట్లాడుతూ తాను కేఎస్‌సీఏ అధ్యక్ష పోటీకి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్‌కు పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావాలని.. ఇందుకు తెర వెనుక నుంచి ఎవరూ నియంత్రించలేని పరిపాలన అవసరమన్నారు.
కుంబ్లే అధ్యక్షుడిగా, శ్రీనాథ్ కార్యదర్శిగా, తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2010–2013లో విజయవంతమైన కాలాన్ని పునరావృతం చేసేందుకు తన ప్యానెల్ ప్రయత్నిస్తుందని మాజీ బౌలర్ తెలిపారు. ఆ సమయంలో క్రికెట్ అసోసియేషన్‌ను బ్యాక్ డోర్లో నడిపేందుకు అనుమతి లేదని.. క్రికెట్, మౌలిక సదుపాయాలు రెండూ అభివృద్ధి చెందాయని.. ప్రస్తుత పరిస్థితి విచారకంగా ఉందని.. దీన్ని మెరుగుపరుచాల్సిన అవసరం ఉందన్నారు. భారత మాజీ బ్యాట్స్‌మన్ సుజిత్ సోమసుందరం (వైస్ ప్రెసిడెంట్), సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వినయ్ మృత్యుంజయ (సెక్రటరీ), ఏవీ శశిధర్ (జాయింట్ సెక్రటరీ), మధుకర్ (కోశాధికారి), కర్నాటక మాజీ క్రికెటర్ అవినాష్ వైద్య (సంస్థాగత సభ్యుడు) పోటీ చేయనున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సోమసుందరం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎడ్యుకేషన్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.
పదవి, అధికారం కోసం కాదని.. కర్నాటక క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావడం గురించి తాము పోటీ చేస్తున్నామన్నారు. అదే సమయంలో మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సైతం కేఎస్‌సీఏలో తేవాల్సిన మార్పు అవసరాన్ని నొక్కి చెప్పారు. కర్నాటక క్రికెట్ కష్టాల్లో ఉందని.. మనం మన వైభవాన్ని తిరిగి పొందాల్సిన అవసరం ఉందని.. ఒకప్పుడు రంజీ ట్రోఫీలో ముంబయి తర్వాత రెండోస్థానంలో నిలిచామని.. ఇటీవల ఆ గుర్తింపు మసకబారిందన్నారు. ఇప్పుడు మనకు వెనుక సీటు డ్రైవింగ్ సిండ్రోమ్‌ను అంతం చేసే నాయకత్వం అవసరమని శ్రీనాథ్ పేర్కొన్నారు. పరిపాలనలో గౌరవం ఉన్నప్పుడు వెనుక నుంచి ఎవరూ నియంత్రించాల్సిన అవసరం ఉండదని.. వెంకీ నాయకత్వంలో మరోసారి బలమైన మౌలిక సదుపాయాలు, అవకాశాలను సృష్టించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.