దుబాయ్: భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. తద్వారా భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. ఏడాది కాలంగా ఈ ఫార్మాట్లో అంచనాలకు మించి రాణిస్తున్న ఈ తమిళనాడు స్పిన్నర్..
తాజా ర్యాంకుల్లో మూడు స్థానాలు ఎగబాకి 733 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (884 రేటింగ్ పాయింట్లు) మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆల్‌రౌండర్ల విభాగంలో హార్ధిక్ పాండ్యా (237) నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమ్ఇండియా.. 271 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆసీస్, ఇంగ్లండ్, కివీస్ తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.