కౌలాలంపూర్: ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. మలేషియాతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 31 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా.. లక్ష్యాన్ని 2.5 ఓవర్లలోనే ఛేదించింది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 47 పరుగులకే పరిమితం చేసిన భారత బౌలర్లు.. మలేషియా బ్యాటర్లకు ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ (5/5) ఐదు వికెట్లతో చెలరేగింది. అందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం.
రెండో ఎడిషన్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తరఫున ఇదే తొలి హ్యాట్రిక్. అయూషి శుక్లా (3/8) ఆ జట్టును కట్టడిచేసింది. మలేషియా బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయకపోగా నలుగురు డకౌట్ అయ్యారు. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 11 పరుగులే ఆ జట్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఛేదనలో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష (12 బంతుల్లో 27 నాటౌట్, 5 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో వికెట్ నష్టపోకుండానే భారత్ మ్యాచ్‌లో జయభేరి మోగించింది. వైష్ణవికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తాజా విజయంతో గ్రూప్-ఏలో భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. లంకకూ 4 పాయింట్లే ఉన్నా నెట్న్ రేట్ విషయంలో భారత్ మెరుగ్గా నిలిచింది. లీగ్ దశలో భారత్.. గురువారం శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది.