దోహ: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (42 బంతుల్లో 144, 11 ఫోర్లు, 15 సిక్స్‌లు) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో తానెంత ప్రమాదకర ఆటగాడో ప్రపంచానికి చాటిచెప్పాడు. ఖతార్‌లో జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో 14 ఏండ్ల ఈ పాలబుగ్గల పసివాడు 32 బంతుల్లోనే శతకం బాది రికార్డుల దుమ్ము దులిపాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన (32 బంతుల్లో రిషభ్ పంత్‌కు తొలి స్థానం) సెంచరీ.
వైభవ్ బాదుడుకు తోడు కెప్టెన్ జితేశ్ శర్మ (32 బంతుల్లో 83 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచడంతో యూఏఈ ‘ఏ’తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత ‘ఏ’ జట్టు 20 ఓవర్లలోనే 297/4 పరుగుల రికార్డు స్కోరు చేసింది. వైభవ్ చేసిన 144 రన్స్‌లో ఏకంగా 134 పరుగులు ఫోర్లు (44), సిక్సర్లు (90) రూపంలోనే రావడం విశేషం. అనంతరం ఛేదనలో యూఏఈ.. నిర్ణీత ఓవర్లలో 149/7 చేసింది. తద్వారా భారత యువ జట్టు 148 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.