Vaibhav Sooryavanshi | శ్రీలంకలోని దాంబూలా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనూహ్య పరిణామాలకు వేదికైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ ఓటమి పాలైనప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న ఘర్షణ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడిని తోసేయడం వెనుక అసలు కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.మ్యాచ్ చివరి వరకు హోరాహోరీగా సాగడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. గెలుపు కోసం భారత్‌కు 17 పరుగులు అవసరమయ్యాయి. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కుగాథస్ మథులన్ వేసిన సూపర్ ఓవర్లో చివరి మూడు బంతులను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఒక బౌండరీతో కలిపి కేవలం 6 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. దీంతో భారత్ 9 పరుగులకే పరిమితమై వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.
ఓటమి తర్వాత వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ శెడ్గే నిరాశగా పెవిలియన్ వైపు నడుస్తుండగా పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. సూపర్ ఓవర్లో వైభవ్‌ను కట్టడి చేసిన బౌలర్ మథులన్ అతడిని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అప్పటికే ఓటమి బాధలో ఉన్న యువ బ్యాటర్ ఆ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆగ్రహంతో వెనక్కి తిరిగి బౌలర్ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన వైభవ్‌ను అడ్డుకునేందుకు శ్రీలంక ఫీల్డర్ విషేన్ హలంబెజ్ మధ్యలోకి వచ్చాడు. అయితే ఆ సమయంలో భావోద్వేగాలకు లోనైన వైభవ్ అతడిని గట్టిగా పక్కకు నెట్టడంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి ప్రతిస్పందనగా శ్రీలంక ఆటగాళ్లు కూడా ముందుకు రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపించాయి.
అయితే శ్రీలంక సీనియర్ క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా సమయోచితంగా వ్యవహరించి ఇరువర్గాల ఆటగాళ్లను శాంతింపజేశారు. ఆయన జోక్యంతో పెద్ద గొడవకు దారితీయకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక మ్యాచ్ ముగిసే సమయానికి వెలుతురు తక్కువగా ఉండటంపై కూడా వివాదం చెలరేగింది. బ్యాడ్ లైట్ కారణంగా బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందని భారత జట్టు భావించింది. మొదట ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఉండదని అనుకున్నప్పటికీ, భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో సుదీర్ఘంగా చర్చించి సూపర్ ఓవర్ నిర్వహించేలా ఒప్పించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కూడా తిలక్ వర్మ, అంపైర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చల సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా ఆవేశంగా కనిపించడంతో భారత జట్టు ప్రధాన కోచ్ హృషికేష్ కనిట్కర్ స్వయంగా అతడిని పక్కకు తీసుకెళ్లి శాంతింపజేసినట్లు మ్యాచ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ వివాదంపై తాజాగా వైభవ్ కూడా స్పందించాడు. తాను కావాలని గొడవ పడలేదని, శ్రీలంక ప్లేయర్స్ తనని ఇరిటేట్ చేయడం వల్లనే తాను అలా స్పందించాల్సి వచ్చిందని అన్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం నన్ను టార్గెట్ చేసి బూతులు తిట్టారని, అందుకే అలా స్పందించాల్సి వచ్చిందని అన్నాడు. ఇప్పుడు ఈ ఘటనపై మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రకాష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్లని హెచ్చరికతో సరిపెడతారా? లేక క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? అన్నదానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
छोटा बच्चा समझ के न कोई आँख दिखाना रे…
Vaibhav Sooryavanshi🔥 💪⚠️— BHUSHAN (@realBhushanji) June 15, 2026