Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో నాసిరకం పతకాలు ఇస్తున్నారంటూ పారిస్ పరువు తీసిన ఓ అథ్లెట్‌కు కొత్త మెడల్ దక్కింది. అమెరికా స్కేట్‌బోర్డ్ ఆటగాడు నిజయ్ హూస్టన్ (Nyjah Huston)కు విశ్వక్రీడల నిర్వాహకులు మరో మెడల్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..? జూలై 29న జరిగిన స్కేట్ బోర్డ్ పోటీల్లో హూస్టన్ కాంస్యం గెలిచాడు.
అయితే వారం రోజులకే ఆ పతకం రంగు వెలిసిపోవడం గమనించిన అతడు సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దాంతో ఒలింపిక్ నిర్వాహకులు అతడికి మరొక కాంస్యాన్ని ఇచ్చారు. ‘ఒలింపిక్ మెడల్స్ అథ్లెట్లకు ఎంతో విలువైనవి. దెబ్బతిన్న పతకాలను మొన్ని డి పారిస్ స్వీకరిస్తుంది. వాటిని కొత్త వాటిలా మార్చి అథ్లెట్లకు ఇస్తుంది’ అని విశ్వ క్రీడల నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
‘ఒలింపిక్ మెడల్స్ కొత్తగా ఉన్నప్పుడు మెరిసిపోతాయి. కానీ, అవి నా చర్మం మీద చెమటకు తడిసి, నా స్నేహితులు వాటిని మెడలో వేసుకున్నాక రంగు తేలిపోయి పాతవాటిలా మారుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఒలింపిక్ మెడల్స్ నాణ్యమైనవి కావు. చూడండి ఈ మెడల్ ఎంత గరుకుగా మారిందో. ముందు భాగం కూడా దెబ్బతిన్నది’ అని హూస్టన్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశాడు.