Natwar Singh | మాజీ విదేశాంగ శాఖ మంత్రి కే నట్వర్ సింగ్ (93) సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడుతూ శనివారం పొద్దుపోయిన తర్వాత మృతి చెందారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ లో 1931లో జన్మించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ ను 1984లోనే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది. యూపీఏ తొలి విడుత ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన నట్వర్ సింగ్, పాకిస్థాన్ లో భారత్ రాయబారిగా, పలు దేశాల దౌత్యవేత్తగా పని చేశారు.
1966-71 మధ్య మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలో సివిల్ సర్వీసెస్ అధికారిగా పని చేశారు. 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నట్వర్ సింగ్.. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. నట్వర్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా ధృవీకరించారు. నట్వర్ సింగ్ మరణంతో ఆయన కుటుంబానికి దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుతున్నట్లు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. నట్వర్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
2004-05 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా నట్వర్ సింగ్ పని చేశారు. 2005లో కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత 2008లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. సద్దాం హుస్సేన్ ఆయిల్ ఫర్ ఫుడ్ స్కాంలో ఆయన, ఆయన కొడుకు లబ్ధి పొందారన్న వోల్కర్ నివేదికతో నట్వర్ సింగ్ కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరిగింది. ‘నెహ్రూ వారసత్వం- చిరస్మరణీయ నివాళి’, ‘మై చైనా డైరీ 1956-88’ అనే పుస్తకాలతోపాటు ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనప్’ అనే తన జీవిత చరిత్రనూ నట్వర్ సింగ్ రాశారు.