T20 World Cup | డల్లాస్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయంతో కదంతొక్కింది. గురువారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు(సూపర్ ఓవర్)లో యూఎస్ఏ చారిత్రక విజయం సాధించింది. మహమ్మద్ ఆమిర్ వేసిన సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ వికెట్ కోల్పోయి 13 పరుగులకు పరిమితమైంది. టీ20ల్లో పాకిస్థాన్‌పై యూఎస్ఏకు ఇది తొలి విజయం కావడం విశేషం. అంతకుముందు టాస్ కోల్పోయిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది.
ఆ జట్టు బ్యాటర్లలో సారథి బాబర్ ఆజమ్ (44), షాదాబ్ ఖాన్ (40) ఫర్వాలేదనిపించగా ఆఖర్లో షహీన్ షా అఫ్రిది (23 నాటౌట్) మెరుపులతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. రిజ్వాన్(9), ఉస్మాన్‌ఖాన్(3) ఫకర్ జమాన్(11), అజమ్‌ఖాన్(0) ఘోరంగా విఫలమయ్యారు. అమెరికా బౌలర్లు సమిష్టిగా రాణించి బాబర్ సేనను కట్టడి చేశారు. నొస్తుష్ కెంజిగె (3/30), నేత్రవల్కర్ (2/18) అద్భుత బౌలింగ్‌తో పటిష్టమైన పాక్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులు చేసింది. ఓపెనర్ మెనాక్ పటేల్(50), అరోన్ జోన్స్(36 నాటౌట్), అండ్రిస్ గౌస్(35) రాణించారు. అమిర్, నసీమ్షా, రవూఫ్ ఒక్కో వికెట్ తీశారు. మోనాక్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 159/7 (బాబర్ 44, షాదాబ్ 40, కెంజిగె 3/30, నేత్రవల్కర్ 2/18).
అమెరికా: 20 ఓవర్లలో 159/3 (మోనాక్ పటేల్ 50, జోన్స్ 36 నాటౌట్, అమిర్ 1/25, నసీమ్ 1/26)
అమెరికా: 18/1
పాకిస్థాన్: 13/1