US Open 2024 : ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ (US Open 2024) త్వరలోనే మొదలవ్వనుంది. ఈ సీజన్లో ఆఖరిదైన ఈ గ్రాండ్‌స్లామ్‌కు ఆగస్టు 26న తెర లేవనుంది. ఈసారి పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 128 మంది పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. నొవాక్ జకోవిచ్ (Novak Djokovic), అమెరికా టీనేజర్ కొకో గాఫ్ (Coco Gauff)లు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగనున్నారు. విజేతలకు రూ.30 కోట్లు, రన్నరప్‌లకు 15 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది.
ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ ఉత్కంఠగా సాగనుంది. పురుషుల సింగిల్స్‌లో ఈసారి కూడా తగ్గ పోరు ఖాయమనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్, రజతం సాధించిన కార్లోస్ అల్కారాజ్లు ఫేవరెట్లుగా ఆడనున్నారు. మరోవైపు ఇటలీ కెరటం జన్నిక్ సిన్నర్, రష్యా యోధుడు డానిల్ మెద్వెదేవ్ కూడా టైటిల్‌పై గురి పెట్టారు. 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జకోవిచ్‌కు ఈ ముగ్గురి నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది.
మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ టాప్ సీడ్ దక్కించుంది. అమెరికా సంచలనం కొకో గాఫ్ వరుసగా రెండో టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. బెలారస్ టెన్నిస్ స్టార్ అజరెంక, వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన నవోమి ఒసాకాలు కూడా టైటిల్ వేటలో ముందున్నారు.
నవోమి ఒసాకా
ఒకప్పుడు యూఎస్ ఓపెన్ (US Open) విజేతలైన స్టాన్ వావ్రింకా, డోమినిక్ థీమ్, నవొమి ఒసాకా, బియంకా అండ్రెస్కులు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్లు ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించారు. క్రిస్టోఫర్ యుబ్యాంక్స్(అమెరికా), జచారి స్వాజ్డా, లెర్నర్ టియెన్, మాథ్యూ ఫోర్బ్స్, అలెగ్జాండర్ ముల్లెర్(ఫ్రాన్స్), ట్రిస్టన్ స్కూల్‌కేట్(ఆస్ట్రేలియా)లు బరిలోకి దిగుతున్నారు. ఇక రెండుసార్లు యూఎస్ చాంపియన్ అయిన ఒసాకా రెండేండ్ల తర్వాత ఈ టోర్నీలో ఆడనుంది. కాన్పు కోసం బ్రేక్ తీసుకున్న ఆమె ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది.