Pat Cummins ; ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఆటకు విరామం ప్రకటించాడు. గత కొంతకాలంగా ప్రతి సిరీస్ ఆడుతున్న ఈ స్పీడ్‌స్టర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగియడంతో స్కాట్లాండ్, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అయితే.. స్వదేశంలో టీమిండియాతో జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy 2024-25) కోసమే కమిన్స్ బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం. దాదాపు 8 వారాలు అంటే రెండు నెలల పాటు ఈ స్పీడ్‌స్టర్ విశ్రాంతి తీసుకోనున్నాడు.
తన కెప్టెన్సీలో ఆసీస్‌కు టెస్టు గద, వన్డే వరల్డ్ కప్ అందించిన కమిన్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ‘ఎవరైనా బ్రేక్ తర్వాత కొంచెం ఫ్రెష్‌గా కనిపిస్తారు. అలాగని ఆటకు దూరమయ్యామని బాధ పడాల్సిందేమీ లేదు. నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నుంచి నేను సుదీర్ఘంగా బౌలింగ్ చేస్తున్నా. 18 నెలలుగా బ్రేక్ తీసుకోలే. ఈ 7-8 వారాల విశ్రాంతి నాకు ఎంతో ఉపయోగపడనుంది. నా శరీరం కూడా మెరుగవుతుంది.
దాంతో, ఈ వేసవిలో మళ్లీ చెలరేగేందుకు అవసరమైన శక్తిని పొందుతా. ఈజీగా బౌలింగ్ చేయడంతో పాటు గాయాల పాలవ్వకుండా ఉంటాను’ అని కమిన్స్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో వెల్లడించాడు. అంతేకాదు ఈసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ గెలవడమే తన లక్ష్యమని అతడు చెప్పాడు.
‘నేను ఇప్పటివరకూ గెలవని ట్రోఫీ అంటే బోర్డర్ – గవాస్కర్. జట్టులోని చాలామంది కూడా ఈ సిరీస్ నెగ్గలే. స్వదేశంలో సిరీస్ గెలిచేందుకు ఎంతో పట్టుదలగా ఉన్నాం. భారత్ మంచి జట్టు. ఇండియాతో మేము చాలా క్రికెట్ ఆడాం. భారత ఆటగాళ్ల గేమ్ మాకు తెలుసు. అయితే.. మేము కూడా గొప్పగా ఆడగలం’ అని కమిన్స్ తెలిపాడు.
కమిన్స్ నిరుడు జూన్ నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్ కప్.. ఆ తర్వాత ఐపీఎల్.. టీ20 ప్రపంచ కప్.. ఇలా వరుసపెట్టి టోర్నీలు ఆడాడు. నవంబర్ 22న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలవ్వనుంది. 1992 తర్వాత తొలిసారిఐదు టెస్టుల మ్యాచ్‌గా జరుగనుంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టు
టెస్టు క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యానికి భారత్ చెక్ పెట్టింది. 2017 తర్వాత బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని కంగారూ జట్టు గెలవలే. వరుసగా నాలుగు పర్యాయాలు భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. దాంతో.. ఎలాగైనా సరే ఈసారి బీజీటీని ఒడిసిపట్టాలని కమిన్స్ బృందం పట్టుదలతో ఉంది.