KTR : జగిత్యాల జిల్లా మోరపెల్లి మండలంలో 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుక టైర్లు ఓవర్ లోడ్ కారణంగా ఊడిపోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందించారు. 50 మంది వెళ్లాల్సిన బస్సులో 170 మంది ప్రయాణించడంతో టైర్లు ఊడిపోయాయని, నిజంగా ఆ బస్సులోని ప్రయాణికులు అదృష్టవంతులు కాబట్టి ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.
అమాయక ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బస్సుల సంఖ్య ఎప్పుడు పెంచుతారని నిలదీశారు. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పరిమితికి మించకుండా ఎలాంటి భద్రతా నిబంధనలు పాటిస్తున్నారని అడిగారు. ఓవర్‌లోడ్ కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న డ్రైవర్లు, కండక్టర్లకు ఎలాంటి పరిహారం అందజేస్తున్నారని ప్రశ్నించారు.
శనివారం జగిత్యాల నుంచి నిర్మల్‌కు వెళ్తున్న బస్సులో ఏకంగా 170 మంది ప్రయాణికులు ఎక్కారు. ఓవర్ లోడ్ కారణంగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి శివారుకు చేరుకోగానే.. బస్సు వెనుక కుడివైపున ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికులకు సరిపడా బస్సులు నడపడం లేదని జనం మండిపడుతున్నారు. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అదనపు బస్సులు నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు.