Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బాహుబలి కాదు.. బలహీన బలి అని ఎద్దేవా చేశారు. కేంద్రం సాయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు పదే పదే పరుగులు పెడుతున్నారని ప్రశ్నించారు.
మెజార్టీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే చెక్కులతో చంద్రబాబు దగ్గరకు రావాలని చింతా మోహన్ సూచించారు. బిహార్ ముఖ్యమంత్రికి అవసరమైనా ఆయన ఢిల్లీ వెళ్లడం లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. బాబు పదే పదే ఢిల్లీకి వెళ్లడం సరికాదని హితవు పలికారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటకు రాకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులో బైపాస్ రోడ్ల విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది గదికి వెలుపల గడియపెట్టి భోజనానికి వెళ్లారు. ఇంతలో కార్యాలయం లోపల నుంచి పొగలు రావడం గమనించి అప్రమత్తమైన అధికారులు.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కార్యాలయంలో దేవుడి పటం వద్ద ఉంచి దీపం ప్రమాదవశాత్తూ కింద పడటంతో దస్త్రాలు కాలిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.