న్యూఢిల్లీ : దేశంలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రపంచ క్రీడల్లో టాప్-5లో నిలువడమే ఏకైక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చింది. ‘ఖేలో భారత్ నీతి- 2025’ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2001 పాలసీకి కొనసాగింపుగా భావిస్తున్న దీనికి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ భేటీలో గ్రీన్‌సిగ్నల్ లభించింది. దేశంలో తొలిసారి 40 ఏండ్ల క్రితం 1984లో జాతీయ స్పోర్ట్స్ పాలసీకి అంకుర్పారణ జరుగగా, ఇన్నేండ్లకు తిరిగి పునరుద్ధరణకు నోచుకుంది. దేశం ఆతిథ్యమిచ్చే అవకాశమున్న 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రీడాభివృద్ధి చేయడానికి పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
‘గత 10 ఏండ్ల నుంచి ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ నూతన పాలసీకి రూపకల్పన చేశాం. 2047 నాటికి ప్రపంచంలో భారత్‌ను టాప్-5 క్రీడా దేశంగా మార్చాలన్నది మా ప్రధాన ఉద్దేశం. క్రీడల పట్ల ప్రధానికి స్పష్టమైన ఎజెండా ఉంది. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి పాలసీ ద్వారా అడుగులు పడుతాయి’ అని అన్నారు. ఇదిలా ఉంటే ఖేలో భారత్ నీతి పాలసీలో కేంద్ర మంత్రులు, నీతి అయోగ్, రాష్ట్ర ప్రభుత్వాలను, జాతీయ క్రీడా అసోసియేషన్లను, అథ్లెట్లను, నిపుణులను భాగస్వామ్యులగా చేయబోతున్నారు. దీనికి తోడు పలు ప్రముఖ కంపెనీల సహకారంతో ఒక్కో ఒలింపిక్ క్రీడాభివృద్ధికి కృషి చేయనున్నారు.