ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ విజయ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. సరిగ్గా రెండేండ్ల క్రితం కరీబియన్ దీవుల్లో మొదలైన టీమ్ఇండియా మెగాటోర్నీల వేటలో మరో కప్ చేరింది. రోహిత్‌శర్మ, హర్మన్ప్రీత్కౌర్ను అనుసరిస్తూ ఆయూశ్ నాయకత్వంలోని యువ భారత్..అండర్-19 ప్రపంచకప్‌లో విజయబావుటా ఎగురవేసింది. మెగాటోర్నీలో అపజయమెరుగని భారత్..రికార్డు స్థాయిలో ఆరోసారి కప్‌ను సగర్వంగా ముద్దాడింది. 14 ఏండ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ(175) సూపర్ సెంచరీతో విజృంభించిన వేళ భారీ స్కోరు(411/9) అందుకున్న టీమ్ఇండియా..ఇంగ్లండ్‌పై చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. నూనుగుమీసాల సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై వీరవిహారం చేశాడు. విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ వారసులమని నిరూపించుకుంటూ అండర్-19 ప్రపంచకప్‌పై చెరుగని ముద్రవేశారు.
హరారే: అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. టైటిల్ ఫెవరేట్ హోదాకు తగ్గట్లు మెగాటోర్నీలో అపజయమెరుగని యువ భారత్ ఆరోసారి వరల్డ్‌కప్‌ను తమ సొంతం చేసుకుంది. శనివారం పరుగుల వరద పారిన ఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మెగాటోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగిన ఆయూశ్ మాత్రె సారథ్యంలోని యువ భారత్..విజయదుందుభి మోగించింది. తొలుత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(80 బంతుల్లో 175, 15ఫోర్లు, 15సిక్స్‌లు) ధనాధన్ సెంచరీకి తోడు కెప్టెన్ ఆయూశ్ మాత్రె(53), అభిజ్ఞాన్ కుందు(40) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 411/9 స్కోరు చేసింది. హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (9)నిరాశపరిచినా..సూర్యవంశీ తన సహజసిద్ధమైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
55 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న ఈ బీహారీ బుడతడు ఒకానొక దశలో డబుల్ సెంచరీపై కన్నేశాడు. సూర్యవంశీ బాదుడుకు టీమ్ఇండియా 500 మార్క్ అందుకుంటుదనుకున్న అభిమానులకు అతని నిష్క్రమణతో నిరాశే ఎదురైంది. జేమ్స్ మింటో(3/63), అలెక్స్ గ్రీన్(2/49) ఆకట్టుకున్నారు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్ ఫాల్క్‌నర్(115) సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోగా, బెన్ డాకిన్స్(66) రాణించాడు. అంబరీశ్(3/56) మూడు వికెట్లు తీయగా, దీపేశ్(2/64), కనిశ్క్(2/63) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అద్భుత ప్రదర్శనతో భారత ప్రపంచకప్ విజయంలో కీలకంగా వ్యవహరించిన వైభవ్ సూర్యవంశీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు సిరీస్ దక్కింది.
టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోమారు తన సత్తా ఏంటో ప్రపంచ వేదికపై చూపెట్టాడు. టోర్నీ ఏదైనా ఆకాశమే హద్దుగా చెలరేగడం నైజంగా మార్చుకున్న సూర్యవంశీ..అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ అదే చేసి చూపెట్టాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో 20 పరుగులకే సహచర ఓపెనర్ ఆరోన్ ఔటైన వేళ తాను ఉన్నానంటూ సూర్యవంశీ చెలరేగిన తీరు నభూతో నభవిష్యత్. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికిఆరేస్తూ సూర్యవంశీ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. పిచ్‌పై బంతి పడటం ఆలస్యం..తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలవోకగా ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు.
సూర్యవంశీ ధాటికి తొలి 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 79/1 స్కోరు చేసింది. మరో ఎండ్‌లో ఆయూశ్ అండగా మరింత రెచ్చిపోయిన వైభవ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే మరో 50 పరుగులు చేరుకునేందుకు వైభవ్ 23 బంతులు అవసరమయ్యాయి. అంటే ఈ యువ బ్యాటర్ విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 71 బంతుల్లో 151 చేరుకున్న వైభవ్‌ను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. పోటీపడి సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో టీమ్ఇండియా స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న క్రమంలో లమ్స్‌డెన్ బౌలింగ్‌లో కీపర్ రూ క్యాచ్‌తో వైభవ్ నిష్క్రమించడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వేదాంత్(32), విహాన్(30), అభిజ్ఞాన్(40), కనిశ్క్(37 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది.
భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఓపెనర్లు డాకిన్స్, మూర్స్(17) ధాటి ఆడటంతో ఇంగ్లండ్ దూకుడు కనబరిచింది. వీరికి తోడు మయేస్(45) ఉన్నంతసేపు బ్యాటు ఝులిపించడంతో ఒక దశలో ఇంగ్లండ్ 173/3 మెరుగ్గా కనిపించింది. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఫాల్క్‌నర్ ఆదుకునే ప్రయత్నం చేశాడు.
భారత్: 50 ఓవర్లలో 411/9(సూర్యవంశీ 175, ఆయూశ్ 53, మింటో 3/63, గ్రీన్ 2/49),
ఇంగ్లండ్: 40.2 ఓవర్లలో 311 ఆలౌట్(ఫాల్క్‌నర్ 115, డాకిన్స్ 66, అంబరీశ్ 3/56, కనిశ్క్ 2/63)