UTT | ఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరుగబోయే అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)- 7వ సీజన్ కోసం ఐదు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్యాడ్లర్లను రిటైన్ చేసుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్రముఖ భారత ప్యాడ్లర్లు పాత ఫ్రాంచైజీలకే ఆడనున్నారు.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన చెన్నై లయన్స్.. ఆచంట శరత్ కమల్‌ను తమ వద్దే అట్టిపెట్టుకోగా మణికా బత్రాను బెంగళూరు స్మాషర్స్ రిటైన్ చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ హర్మీత్ దేశాయ్‌ను, దబాంగ్ ఢిల్లీ సతియన్ జ్ఞానశేఖర్‌ను.. యూ ముంబా యువ ఆటగాడు మానవ్ ఠక్కర్‌ను నిలుపుకున్నట్టు యూటీటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ఆధ్వర్యంలో 2017 నుంచి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఏడాది నుంచి 8 జట్లు తలపడనున్నాయి. నిబంధనల ప్రకారం ఆరు పాత ఫ్రాంచైజీలు ఒక భారత ఆటగాడిని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉండగా పునేరి పల్టన్ తప్ప మిగిలిన ఐదు జట్లూ రిటైన్ ప్రక్రియను పూర్తిచేశాయి. ఈ సీజన్ నుంచి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న జైపూర్ పాట్రియట్స్, అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ త్వరలో విడుదల కాబోయే ‘ఫస్ట్ డ్రాఫ్ట్’ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.