దుబాయ్: రెండేండ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో రెండో ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ఐసీసీ ఒక ప్రకటన ద్వారా షెడ్యూల్‌ను ప్రకటించింది. మలేషియా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్.. గ్రూప్-ఏలో మలేషియా, వెస్టిండీస్, శ్రీలంకలో తలపడాల్సి ఉంది.
గ్రూప్-బీ లో ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్ఏ.. గ్రూప్-సీ లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, సమోవ, క్వాలిఫయర్ (ఆఫ్రికా రీజియన్ నుంచి) ఉండగా గ్రూప్-డీ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, క్వాలిఫయర్ (ఆసియా రీజియన్ నుంచి) చోటు దక్కించుకున్నాయి. ఈ టోర్నీ తొలి ఎడిషన్ (2023)లో షఫాలీ వర్మ సారథ్యంలోని యువ భారత జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రెండో ఎడిషన్‌లో జనవరి 19న వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌తో భారత్ వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది.
16 జట్లు పోటీపడనున్న ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగనుంది. గ్రూప్ దశలో ఒక్కో జట్టు ప్రత్యర్థితో ఒక మ్యాచ్ ఆడనుండగా టాప్-3లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. రెండు గ్రూపులలో టాప్-2లో ఉన్న జట్లు (4) సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. బ్యూమస్ ఓవల్ వేదికగా జనవరి 31న రెండు సెమీస్‌లు జరుగనుండగా ఫిబ్రవరి 2న ఫైనల్ పోరు జరుగనుంది. టీమ్ఇండియా సెమీస్ చేరితే రెండో సెమీఫైనల్స్ ఆడే అవకాశముంది. సెమీస్, ఫైనల్స్‌కు రిజర్వ్ డే లు ఉన్నాయి.