Team India | కౌలాలంపూర్: ప్రత్యర్థి ఎవరైనా మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో తమకు తిరుగేలేదని యువ భారత్ మరోసారి నిరూపించింది. అపోజిషన్ టీమ్‌ను రెండంకెల స్కోరుకే పరిమితం చేస్తున్న మన బౌలర్లు.. బంగ్లా బ్యాటర్లపైనా అదే దూకుడును కొనసాగించి టీమ్ఇండియాకు ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని అందించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. సూపర్ సిక్స్‌లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్‌లో బంగ్లాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ (3/15) స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్ పనిపట్టగా సీమర్లు జోషిత (1/6), షబ్నమ్ షకిల్ (1/7) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. కెప్టెన్ సమైయ అక్తర్ (21), జన్నతుల్ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
ఛేదనను భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష బ్యాటింగ్ (31 బంతుల్లో 40, 8 ఫోర్లు)తో పాటు బంతి (1/6)తోనూ మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. వైష్ణవికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. కాగా ఈ టోర్నీలో భారత్‌తో తలపడిన ఒక్క జట్టు కూడా మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58)తో పాటు తాజాగా బంగ్లాదేశ్ (64) కూడా 70 పరుగుల లోపే తోకముడిచాయి.