Mike Tyson : వరల్డ్ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ (Mike Tyson) అనూహ్యాంగా ఓ కుర్రాడి చేతిలో ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బలశాలి అయిన టైసన్ వయసు పైబడడం వల్లనే చురుకుగా కదలేక బౌట్ చేజార్చుకున్నాడని విశ్లేషకులు అంటున్నారు. అయితే.. ఒకప్పుడు అరవీర భయంకర ఫైటర్లను చిత్తు చేసిన అతడు ఈసారి పంచ్ పవర్ చూపలేకపోయాడు. అందుకు కారణం ఏంటి? అనేది మాత్రం టైసన్కే తెలుసు.
జేక్ పాల్‌తో బౌట్ ఓడిన అనంతరం అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చావు అంచులదాకా వెళ్లొచ్చిన తను ఈస్థాయిలో పోరాడడం నిజంగా గొప్ప విషయమని, తాను గెలిచినట్టేనని టైసన్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం జూన్ 20వ తేదీనే టైసన్, పాల్ మధ్య బిగ్ ఫైట్ జరగాల్సింది. అయితే.. టైసన్ అల్సర్ కారణంగా అనారోగ్యానికి గురవ్వడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఆ సమయంలో ఏం జరిగింది? అనేది చాలామందికి తెలియదు.
This is one of those situations when you lost but still won. I’m grateful for last night. No regrets to get in ring one last time.
I almost died in June. Had 8 blood transfusions. Lost half my blood and 25lbs in hospital and had to fight to get healthy to fight so I won.
To…
— Mike Tyson (@MikeTyson) November 16, 2024
జూన్‌లో తాను ఎదుర్కొన్న గడ్డు రోజుల గురించి టైసన్ చెబుతుంటూ కళ్లు చెమ్మగిల్లడం ఖాయం. ‘మనం ఓడిపోయినా కూడా గెలిచే సందర్భాల్లో ఇది ఒకటి. గత రాత్రి బౌట్ చాలా గొప్పగా సాగింది. మరోసారి రింగ్‌లోకి దిగినందుకు నేను బాధ పడడం లేదు. నేను జూన్‌లోనే దాదాపు చచ్చిపోయానని అనుకున్నా. అప్పుడు నాకు ఎనమిదిసార్లు రక్తమార్పడి చేశారు. ఆ సమయంలో నా ఒంట్లోని సగం రక్తం పోయింది. దెబ్బకు ఏకంగా 11 కిలోలు బరువు తగ్గాను. అయినా సరే అధైర్యపడలేదు. ఆరోగ్యంగా మారి పాల్‌తో ఫైట్ కోసం సిద్దమయ్యాను. నేను మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ, నేను ఎదుర్కొన్న పరిస్థితులు, నా ఆరోగ్యం.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను గెలిచాను’ అని టైసన్ వెల్లడించాడు.
సుమారు 19 ఏండ్ల తర్వాత బాక్సింగ్ రింగ్‌లో దిగిన టైసన్.. యూట్యాబర్ నుంచి బాక్సర్ అవతారమెత్తిన జేక్ పౌల్ (Jake Paul) ధాటికి బిత్తరపోయాడు. రింగ్‌లో మునపటిలా వేగంగా కదలలేకపోయిన అతడు తన పంచ్ పవర్ చూపించలేక 8వ రౌండ్లోనే చేతులెత్తేశాడు. మాజీ చాంపియన్ అయిన టైసన్‌కు చిత్తు చేసిన పౌల్ ఏకంగా రూ.338 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు.
ఇక టైసన్ విషయానికొస్తే.. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో1966 జూన్ 30వ తేదీన జన్మించాడు. పసితనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన టైసన్ బాక్సింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. లెజెండరీ ట్రైనర్ కస్ డీఅమటోస్ వద్ద శిక్షణ తీసుకొని రాటుదేలిన టైసన్ 18 ఏండ్ల వయసులో ప్రొఫెషనల్ బాక్సర్‌గా బరిలోకి దిగాడు.
ప్రత్యర్థులపై కసికొద్దీ పంచ్‌లు విసిరే అతడు1986లో తొలిసారి హెవీవెయిట్ చాంపియన్‌గా అవతరించాడు. అప్పుడు అతడికి 20 ఏండ్లు. దాంతో, చిన్న వయసులోనే హెవీవెయిట్ చాంపియన్ అయిన బాక్సర్‌గా టైసన్ చరిత్ర సృష్టించాడు. రింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టైసన్‌కు ఐరన్ మైక్ అనే పేరు స్థిరపడింది. తన పంచ్ పవర్‌తో ఎందర్నో పడగొట్టిన అతడు 50-6తో ప్రొఫెషనల్ రికార్డు నెలకొల్పాడు. అందులో 44 నాకౌట్స్ ఉండడం విశేషం.