ఢిల్లీ : ఈనెల 24 నుంచి డెన్మార్క్ వేదికగా మొదలుకానున్న ఊబర్ కప్ ఫైనల్స్‌కు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్.. టోర్నీ నుంచి వైదొలిగింది. ఊబర్ కప్ కోసం నిర్వహించిన శిక్షణా శిభిరంలో భాగంగా త్రిసా కాలి మడమకు గాయమవడంతో ఈ జోడీ టోర్నీ నుంచి తపుకున్నట్టు భారత డబుల్స్ కోచ్ బి. సుమిత్ రెడ్డి తెలిపాడు. త్రిసా భుజం గాయం కారణంగా ఈ జంట.. గతనెల స్విస్ ఓపెన్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగింది.
త్రిసా, గాయత్రి తప్పుకోవడంతో వారి స్థానంలో శృతి మిశ్రా, ప్రియా జోడీని టోర్నీకి పంపించినున్నట్టు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలాఉండగా థామస్ కప్ కోసం సిద్ధమయ్యేందుకు గాను ప్రపంచ మాజీ నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. వారం రోజుల ముందుగానే డెన్మార్క్‌కు వెళ్లనుందని సుమిత్ రెడ్డి వెల్లడించాడు.