న్యూఢిల్లీ: సొంతగడ్డపై వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సహా భారీ అంచనాలున్న స్టార్ ప్లేయర్లంతా నిరాశపరుస్తుంటే.. యంగ్ షట్లర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ చరిత్ర సృష్టించారు. మెగా టోర్నీలో సంచలనాల పరంపరను కొనసాగిస్తూ 15 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేశారు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అసాధారణ ఆటతో అదరగొడుతున్న ఈ ద్వయం సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి-ట్రీసా 16-21, 21-15, 21-13తో ప్రపంచ 4వ ర్యాంకర్ జియ యి ఫాన్ – జంగ్ షు జియాన్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది.
సెమీస్ చేరి కాంస్య పతకాన్ని ఖరారు చేసింది. 2011లోగుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట కాంస్యం నెగ్గిన తర్వాత ఈ మెగా టోర్నీ మహిళల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. మరోవైపు టైటిల్ ఫేవరెట్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగియడంతో ఆతిథ్య దేశం నుంచి గాయత్రి-ట్రీసా జోడీ మాత్రమే పోటీలో నిలిచింది.శనివారం జరిగే సెమీస్‌లో ప్రపంచ నంబర్ వన్, చైనా ద్వయం లియు షెంగ్ షు-టాన్ నింగ్‌తో గాయత్రి జోడీకి అసలైన సవాల్ ఎదురవనుంది. ఈ ద్వయంతో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో భారత జోడీ ఒకేసారి గెలిచి ఆరుసార్లు ఓడిపోయింది.
యిఫాన్-జియాన్ చేతిలో గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన గాయత్రి-ట్రీసా తొలిసారి చైనా ద్వయానికి చెక్ పెట్టింది. గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించింది. తొలి గేమ్ ప్రారంభంలో చైనా జంట 6-1తో ముందంజ వేసినా, భారత ద్వయం కోలుకుని 8-9కి స్కోరును తగ్గించింది. అయితే కీలక సమయాల్లో చైనా షట్లర్లు పైచేయి సాధించి తొలి గేమ్‌ను ఖాతాలో వేసుకున్నారు. రెండో గేమ్‌లోనూ చైనా జోడీ 5-1, 10-7తో ముందంజలో నిలిచింది.
తీవ్ర ఒత్తిడి పెరిగిన ఈ దశలో వ్యూహం మార్చిన గాయత్రి-ట్రీసా వరుస పాయింట్లు గెలిచి 13-10తో ఆధిక్యంలోకి వచ్చారు. అదే జోరును కొనసాగిస్తూ క్రాస్ కోర్ట్ స్మాష్‌లు, అద్భుత నెట్ గేమ్‌తో రెండో గేమ్ నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. ఇక, నిర్ణాయక మూడో గేమ్‌లో భారత ద్వయం సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ప్రారంభం నుంచే బలమైన షాట్లతో విరుచుకుపడి 11-5 ఆపై 14-7తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.మరోవైపు చైనా షట్లర్లు ఒత్తిడిలో వరుస తప్పిదాలు చేయడంతో భారత ద్వయం గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

పురుషుల డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఐదో ర్యాంక్ జోడీ సాత్విక్ -చిరాగ్ కనీసం కాంస్య పతకానికి కూడా చేరువ కాలేకపోయారు. భారత ద్వయం 18-21, 9-21తో పారిస్ ఒలింపిక్స్ రజత విజేతలు, మూడో ర్యాంక్ ద్వయం లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో వరుస గేమ్స్‌లో చిత్తుగా ఓడింది. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థికి పోటీ ఇచ్చిన సాత్విక్-చిరాగ్ రెండో గేమ్‌లో పూర్తిగా తేలిపోయింది. చైనా ద్వయంతో ఆడిన 14 మ్యాచ్‌లో భారత జోడీకి ఇది పదో ఓటమి.