బంజారాహిల్స్, సెప్టెంబర్ 29 : డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు తీసుకెళ్లి భారీగా బిల్లు కట్టించడంతో పాటు నకిలీ చెల్లింపు లావాదేవీతో తనను మోసం చేసిందంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో వివరాలను పోలీసులు వెల్లడించారు. కూకట్‌పల్లికి చెందిన 27 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెరుకు హేమంత్‌కు ‘క్వాక్ క్వాక్ ’ డేటింగ్ యాప్ లో ‘దివ్య’ అనే ప్రొఫైల్ తో యువతి పరిచయమైంది. ఈ నెల 28న సాయంత్రం నీరూస్ జంక్షన్ వద్ద ఆమెను కలిసిన హేమంత్‌ను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ నం 36లోని 36 కెమిస్ట్రీ పబ్ కు తీసుకెళ్లింది.
పలురకాల ఆహార, పానీయాలను ఆర్డర్ చేయగా మొత్తం బిల్లు రూ.29,884 వచ్చింది. యువతి తీసుకున్నట్లు కనిపించిన కొన్ని పానీయాలు నాన్ ఆలహాలిక్ గా ఉన్నప్పటికీ వాటిని ఖరీదైన ఆలహాలిక్ పానీయాలుగా బిల్లులో నమోదు చేశారు. బిల్లు చెల్లించే సమయంలో దీనిని నిలదీయగా పబ్ సిబ్బంది, బౌన్సర్లు తన చుట్టూ చేరి బెదిరించారు.
అదే సమయంలో యువతి తాను రూ.10 వేలు చెల్లించినట్లు పేరొంటూ నకిలీ లావాదేవీ చూపించి అకడి నుంచి జారుకుంది. పబ్ యాజమాన్యంతో కుమ్మకై తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు మోసం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ దివ్య అలియాస్ కావ్యతో పాటు 36 కెమిస్ట్రీ పబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు హేయంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.