పారిస్: ఈ నెల 25 నుంచి 31 దాకా పారిస్ వేదికగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో జరగాల్సి ఉన్న వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లకు కఠినమైన డ్రా ఎదురైంది. ఇటీవలి కాలంలో వరుస పరాభవాలతో సతమతమవుతున్న మన షట్లర్లకు ఆరంభ రౌండ్లలోనే కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. పురుషుల సింగిల్స్‌లో భారత నెంబర్ వన్ ఆటగాడు, పారిస్ సెమీఫైనలిస్ట్ అయిన లక్ష్యసేన్.. తొలి రౌండ్లోనే ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ షి యు కి (చైనా)తో తలపడనున్నాడు. ఈ ఇద్దరూ నాలుగు సార్లు ముఖాముఖి తలపడగా.. చైనా షట్లర్ 3-1తో ఆధిక్యంలో ఉన్నాడు.
హెచ్ఎస్ ప్రణయ్‌కు మొదటి రౌండ్లో తేలికైన ప్రత్యర్థే (జోకిమ్ ఓల్డార్ఫ్ ఫిన్లాండ్) ఎదురైనా రెండో రౌండ్లో మాత్రం అతడు డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ అండర్స్ అంటోన్సెన్ను ఢీకొననున్నాడు. అండర్స్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లలోనూ ప్రణయ్‌కు ఓటమి తప్పలేదు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధూకు మూడో రౌండ్ వరకూ అంతగా పేరున్న ప్రత్యర్థులెవరూ లేకపోయినప్పటికీ క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జియి (చైనా)తో ఆడాల్సి రావొచ్చు.
ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయానికి తొలి రౌండ్లో బై దక్కగా రెండో రౌండ్లో భారత్‌కే చెందిన హరిహరన్-రేతినసభాపతితో (ఒకవేళ వీళ్లు తొలి రౌండ్లో గెలిస్తే) ఆడనున్నారు. కానీ ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీకి చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ద్వయం లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్తో పోటీ పడే అవకాశాలున్నాయి. చైనా షట్లర్లు 6-2తో భారత జోడీపై సంపూర్ణ ఆధిపత్యం కల్గి ఉన్నారు. 2011 నుంచి ఈ టోర్నీలో భారత్ కనీసం ఒక్క పతకం అయినా సాధిస్తూ వస్తున్నది. మరి ఈసారి మన షట్లర్లు.. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? లేదా? అనేది త్వరలో తేలనుంది.