అగ్రస్థానానికి అడుగుదూరంలో ఉన్న టీమ్ఇండియా.. చివరి వన్డేలోనూ విజృంభించి న్యూజిలాండ్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ టాప్ ర్యాంక్ దక్కించుకునేందుకు సమాయత్తమైంది. స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న భారత్.. అదే జోష్‌లో ముచ్చటగా మూడోసారి కివీస్‌పై క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తుంటే.. ఆఖరి పోరులోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తున్నది. వరుస డబుల్ సెంచరీలతో జోరుమీదున్న భారత ఆటగాళ్లకు ఇండోర్ స్టేడియంలోని చిన్న బౌండ్రీలు ఊరిస్తున్నాయి. మరింకెందుకు ఆలస్యం పరుగుల వరద పారే పోరును ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
ఇండోర్: ఈ ఏడాది ఆఖర్లో సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు కొనసాగుతున్నాయి. ప్రత్యర్థితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు చేజిక్కించుకుంటున్న టీమ్ఇండియా.. మంగళవారం న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేలు నెగ్గిన రోహిత్ సేన ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోగా.. ఆఖరి పోరులోనూ అదే ఊపు కనబరుస్తూ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తున్నది.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఫుల్ జోష్‌లో ఉండగా.. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడని రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో మిడిలార్డర్ బలంగా ఉండగా.. ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకోనున్నారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న కుల్దీప్ను కొనసాగిస్తారా లేక యజ్వేంద్ర చాహల్‌కు అవకాశమిస్తారా చూడాలి.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చే చాన్స్ ఉంది. ఇదే జరిగితే జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి రానున్నాడు. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ పోరాడితే పోయేదేమీ లేదన్న చందంగా చెలరేగాలని చూస్తోంది. హైదరాబాద్ మ్యాచ్‌లో తమ పోరాటంతో ఆకట్టుకున్న కివీస్.. రాయ్‌పూర్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. ఆ పరాజయాలను పక్కన పెట్టి జట్టు సమష్టిగా కదం తొక్కేందుకు రెడీ అయింది.
‘పని భారాన్ని తగ్గించేందుకే సిరీస్‌లను బట్టి కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నాం. గాయాలు, వర్క్‌లోడ్ ఆటలో భాగమే. వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాం. భారత క్రికెట్లో ఐపీఎల్ కూడా ముఖ్యమే. అందుకే ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీల యాజమాన్యాలతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), మెడికల్ టీమ్ టచ్‌లో ఉంటారు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అంశంపై నేనేం చెప్పలేను. అది సెలెక్టర్లే నిర్ణయిస్తారు’
– రాహుల్ ద్రవిడ్, భారత కోచ్
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, ఇషాన్, సూర్యకుమార్, పాండ్యా, సుందర్, శార్దూల్, కుల్దీప్, సిరాజ్, షమీ/ఉమ్రాన్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), అలెన్, కాన్వే, నికోల్స్, మిషెల్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, షిప్లీ, టిక్నర్, ఫెర్గూసన్.
1 ఈ మ్యాచ్ నెగ్గితే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి చేరనుంది.ప్రస్తుతం టీ20ల్లో టీమ్ఇండియా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నది.