వడోదరా: భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను దక్కించుకున్న టీమ్ఇండియా మంచి జోరుమీదుండగా, వన్డే సిరీస్‌లో పుంజుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది. మధ్య కాలంలో వన్డేల్లో విండీస్‌పై భారత్‌దే ఆధిపత్యమైనా..కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ ఫిట్నెస్ ఆందోళన కల్గిస్తున్నది.
మోకాలి గాయం కారణంగా కౌర్..విండీస్‌తో చివరి రెండు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. కౌర్ గైర్హాజరీలో స్మృతి మందన సూపర్ ఫామ్‌తో అదరగొట్టింది. టీ20ల్లో ప్రదర్శనను వన్డేల్లోనూ కొనసాగించేందుకు మందన సిద్ధంగా ఉన్నది. గత 10 వన్డేల్లో మందన 60 సగటుతో 599 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్‌తో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. మరోవైపు హిలీ మాథ్యూస్, దియోంద్ర డాటిన్, క్యాంప్‌బెల్ లాంటి స్టార్లతో కళకళలాడుతున్నది. తమదైన రోజున వీరు ప్రత్యర్థిపై విరుచుకుపడతారు. మ: 1.30 నుంచి స్పోర్ట్స్-18లో