Champions Trophy | రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు, వర్షానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. 2009వ ఎడిషన్ నుంచి ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌లలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవడం ఇది నాలుగోసారి. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వాన వల్ల టాస్ కూడా పడకుండానే రైద్దెంది. దీంతో ఇరు జట్లు తలా ఒక పాయింట్ పంచుకున్నాయి. ఆసీస్, సఫారీ మ్యాచ్ రద్దవడంతో గ్రూప్- బీ లో సెమీస్ పోరు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్‌లో ఉన్న నాలుగు జట్లకూ సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అవి ఎలాగంటే..
2 బెర్తులు.. 4 జట్లు
గ్రూప్-బీ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ రద్దవడంతో చెరో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తమ తొలి మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆస్ట్రేలియా, సఫారీలు తమ తర్వాతి మ్యాచ్‌లలో గెలిస్తే మిగిలిన సమీకరణాలతో సంబంధం లేకుండా ఆ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. కానీ ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌లతో జరిగే తమ చివరి మ్యాచ్‌లలో ఓడితే అప్పుడు ఆ జట్లకు తిప్పలు తప్పవు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్, అఫ్గాన్ పోరు.. సెమీస్ రేసులో అన్ని జట్లకూ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. టాప్-2 టీమ్స్‌తో సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంటుంది. ఓడిన జట్టు తట్టాబుట్టా సర్దుకోవడమే.
నేటి మ్యాచ్ కూడా రైద్దెతే..!
ఒకవేళ వర్షం కారణంగా బుధవారం ఇంగ్లండ్, అఫ్గాన్ మ్యాచ్ కూడా రద్దు అయితే అప్పుడు సెమీస్ రేసు మరింత రసవత్తరమవుతుంది. ఇంగ్లండ్.. తమ చివరి మ్యాచ్‌లో సఫారీలను ఓడించి.. అఫ్గాన్లు కంగారూలను మట్టికరిపిస్తే అప్పుడు నాలుగు జట్లకూ తలా 3 పాయింట్లు చేరతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా.. +2.140 నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా +0.475తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ -0.475తో థర్డ్ ప్లేస్‌లో అఫ్గాన్.. -2.140తో నాలుగో స్థానంలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా, ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం విదితమే.
ఆ నిధులన్నీ ఏం చేశారు?
దక్షిణాఫ్రికా, ఆసీస్ మ్యాచ్ వర్షార్పణమైన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం ఐసీసీ నుంచి భారీగా నిధుల్ని దక్కించుకున్న పీసీబీ.. వాటిని సరైన రీతిలో వినియోగించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన ‘ఎక్స్’ ఖాతాలోనూ దీనిపై గళమెత్తాడు. రావల్పిండి స్టేడియాన్ని పూర్తిగా కప్పిఉంచే కవర్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని, ఐసీసీ నిధుల్ని ఆతిథ్య దేశం తెలివిగా వినియోగించుకోలేదని అతడు ట్వీట్ చేశాడు.