కటక్: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా ఒడిశా ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఒడిశా ఓపెన్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో హర్యానా అమ్మాయి ఉన్నతి 21-18, 21-11తో భారత్‌కే చెందిన స్మితా తోష్నివాల్పై అద్భుత విజయం సాధించింది. రెండు గేమ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన 14 ఏండ్ల ఉన్నతి ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పిన్న వయసు భారత షట్లర్‌గా రికార్డులకెక్కింది. పురుషుల సింగిల్స్‌లో అన్‌సీడెడ్ కిరణ్ జార్జి 21-15, 14-21, 21-18తో ప్రియాన్షు రజావత్‌పై గెలిచి టైటిల్ చేజిక్కించుకున్నాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో పుల్లెల గాయత్రి, త్రిషా జాలీ ద్వయం 21-12, 21-10తో భారత్‌కే చెందిన శ్రుతి మిశ్రా, సంయోగిత జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ తుది పోరులో ఉదయ్ కుమార్- రవికృష్ణ జోడీకి.. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ ద్వయం త్రిషా జాలీ-అర్జున్ ద్వయానికి నిరాశ ఎదురైంది.