న్యూఢిల్లీ: సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. అసలు ఇలా కూడా ఒక బ్యాటర్ ఔట్ అవుతాడా అన్న రీతిలో జరుగడం యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్ ఇందుకు వేదికైంది. లంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షకీబల్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. సదీరా సమరవిక్రమ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ అంజెలో మాథ్యూస్ హెల్మెట్ సరిగ్గా లేకపోవడాన్ని గుర్తించాడు. దీంతో వెంటనే డగౌట్లో ఉన్న సహచరులకు సైగ చేసి హెల్మెట్ తీసుకురమ్మన్నాడు. ఇదంతా నిశితంగా పరిశీలిస్తున్న బంగ్లా కెప్టెన్ షకీబ్..అంపైర్‌కు ‘హౌ ఈజ్ దట్’ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో లెగ్ అంపైర్‌తో చర్చించిన అంపైర్..మాథ్యూస్‌ను దగ్గరికి పిలిచి మాట్లాడాడు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం మాథ్యూ స్ గార్డ్ తీసుకోకపోవడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా అవాక్కు అయిన మాథ్యూస్ జరిగిన పరిణామాన్ని షకీబ్‌కు వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో కనీసం ఒక్క బంతి ఎదురుకోకుండానే ఔట్ కావడంతో మాథ్యూస్ బౌండరీ దగ్గర హెల్మెట్‌ను నేలకేసి కొట్టి తన కోపాన్ని ప్రదర్శించాడు.
అసలేంటి టైమ్ ఔట్?
ఐసీసీ నిబంధనలను అనుసరించి ఆర్టికల్ 40.11 ప్రకారం వికెట్ పడిన తర్వాత మూడు నిమిషాల్లో కొత్త బ్యాటర్ బంతిని ఎదుర్కోవాలి. అలా జరుగని పక్షంలో బ్యాటర్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటిస్తారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో దీన్ని ఒక నిమిషానికి తగ్గిస్తూ రెండు నిమిషాలుగా నిర్ణయించారు.