Tilak Varma | దుబాయ్ : ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యువ సంచలనాలు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు. బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరగా వరుణ్.. ఏకంగా 25 ర్యాంక్‌లు ఎగబాకి ఐదో ర్యాంక్‌తో టాప్-5లో చోటు సంపాదించాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో జోరుమీదున్న తిలక్.. ఇంగ్లండ్ సిరీస్‌లోనూ రాణిస్తున్నాడు. చెన్నై మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ 72 పరుగులతో రాణించడంతో అతడి ర్యాంకింగ్ మెరుగైంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (855 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా తిలక్ (832) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.వరుణ్.. ర్యాంకింగ్స్‌లో భారీగా మెరుగయ్యాడు. 679 పాయింట్లతో అతడు ఐదో స్థానంలో నిలవగా రషీద్ టాప్‌ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.