వర్త్ వర్మ వర్త్..ఈ ఫేమస్ డైలాగ్ గుర్తుండే ఉంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా ద్వారా పాపులర్ అయిన ఈ డైలాగ్ మన హైదరాబాదీ తిలక్‌వర్మకు అతికినట్లు సరిపోతుంది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం నాలుగో టీ20లో తిలక్ సునామీ సెంచరీ చూసిన ప్రతి ఒక్కరికి మనసులో అనిపించే ఉంటుంది. వాండరర్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ సఫారీలను వర్మ ఓ ఆటాడుకున్నాడు. బౌండరీలు చిన్నబోయేలా ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ బౌలర్లను చేష్టలుడిగేలా చేశాడు. పట్టుమని 20 మ్యాచ్‌లాడిన ఈ నూనుగు మీసాల కుర్రాడు..దక్షిణాఫ్రికాపై ప్రకంపనలు సృష్టించాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో తన విలువేంటో ఘనంగా చాటిచెప్పాడు. గాయాలకు తోడు ఫామ్‌లేమితో జట్టులోకి వస్తూ పోయిన తిలక్..భారత భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
– (నమస్తే తెలంగాణ క్రీడా విభాగం)
నంబూరి ఠాకూర్ తిలక్‌వర్మ..అలియాస్ వర్మ. భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. క్రికెట్ దిగ్గజాలు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత వారి స్థానాలు ఎవరు భర్తీ చేస్తారో అన్న ప్రశ్నలకు పుల్‌స్టాప్ పెడుతూ తాను ఉన్నానంటూ జెండా పాతాడు తిలక్. దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో టీమ్ఇండియాకు తిలక్ రూపంలో అసలు సిసలైన టీ20 ఆణిముత్యం దొరికింది. సంప్రదాయక క్రికెట్ షాట్లకు కామ పెడుతూ ట్రేడ్‌మార్క్ షాట్లతో ఈ హైదరాబాదీ..సఫారీలపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ తీరు ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.
ఇన్ని రోజులు క్లాసిక్ షాట్లకు కట్టుబడ్డ వర్మ..తనలో కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన 22 ఏండ్ల తిలక్..దక్షిణాఫ్రికాతో సిరీస్ ద్వారా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. పేస్‌కు స్వర్గధామమైన సఫారీ పిచ్‌లపై తన విధ్వంసక బ్యాటింగ్‌తో కెరీర్‌కు మెండైన పునాది వేసుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన వర్మ..ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో విశ్వరూపమే చూపాడు.
మూడో టీ20లో ప్రమోషన్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుర్రాడు చాలా పరిణతి కనబరిచాడు. ఓవైపు ఇన్నింగ్స్‌లో దూకుడు తగ్గకుండా పరుగుల జోరు కొనసాగిస్తూ భారీ స్కోరు అందించాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ అదే రిపీట్ చేస్తూ తిలక్ ఆడిన ఆట విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతుతో కీలకమైన మూడో నంబర్లో వచ్చిన తిలక్ తన ప్రమోషన్‌కు సార్థకత చేకూర్చాడు.
ఇన్నాళ్లు క్లాసిక్ షాట్లు ఆడుతూ పరుగులు సాధించిన తిలక్..తన ఆటతీరుకు మరింత మెరుగులు అద్దుకున్నాడు. క్రికెట్లో ఓనమాలు నేర్పించిన సలామ్ బాయిష్ శిక్షణలో మరింత రాటుదేలాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు హైదరాబాద్‌లో తన కొత్త షాట్లకు మరింత పదునుపెట్టుకున్నాడు. సిమెంట్ పిచ్‌పై బుల్లెట్లా దూసుకొచ్చే బంతులను అంతే వేగంతో కొడుతూ ప్రాక్టీస్ చేయడం కలిసొచ్చింది. దీనికి తోడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సహచరుడు సూర్యకుమార్ ఆటతీరును దగ్గరుండి పరిశీలించిన తిలక్ అదే శైలిలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి ఫలితం రాబట్టాడు.
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే నాలుగో టీ20లో అభిషేక్ ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన తిలక్‌ను కట్టడి చేసేందుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను కెప్టెన్ మార్క్మ్ దింపాడు. ఐపీఎల్ తరహాలో ఇబ్బంది పడుతాడనుకున్న తిలక్..మార్క్మ్ ఎత్తులను చిత్తుచేస్తూ మహారాజ్‌ను గట్టిగా అరుసుకున్నాడు. మరోవైపు పేసర్లను అదే స్థాయిలో దంచికొట్టడం తిలక్ ఆటశైలిలో మార్పును తెలుపుతున్నది. ఔట్ సైడ్ ఆఫ్‌స్టంప్ బంతులు వేసిన సింపాలకు తిలక్ అదే శిక్ష వేశాడు. బంతి ఎక్కడ పడ్డా తన ఫుట్‌వర్క్‌ను అంతే వేగంగా మార్చుకుంటూ బంతులను స్టాండ్స్‌లోకి మార్చిన తీరు నభూతో నభవిష్యత్ అనిపించింది.
కీలకమైన మూడో స్థానానికి తిలక్ సరైన న్యా యం చేశాడు. తొలి రెండు టీ20 ల్లో నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటి ంగ్‌కు వచ్చిన తిలక్.. మూ డు, నాలుగు మ్యాచ్‌ల్లో ప్రమోషన్ దక్కించుకున్నాడు. ఇన్ని రోజులు కోహ్లీ లాంటి దిగ్గజం ఆడిన స్థానం లో వచ్చిన తిలక్ ఆశాకిరణంలా కనిపించాడని మ్యాచ్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ ప్రశంసలతో ముంచెత్తాడు.
టీ20ల్లో తిలక్ మ్యా: 20 ప: 616 అ.స్కో: 120* స: 51.33 సె: 2, అ.సె: 2
నోట్: మ్యా: మ్యాచ్‌లు, ప: పరుగులు, స: సగటు, సె: సెంచరీలు, అ.సె: అర్ధసెంచరీలు