Tilak Varma Father : ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో దంచికొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) టీమిండియా తరఫున కూడా ఇరగదీస్తున్నాడు. వెస్టిండీస్‌పై పొట్టి సిరీస్(T20 Series)లో తిలక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత ఆశాకిరణంగా ప్రశంసలు అందుకుంటున్న ఈ యువ సంచలనం గురించి అతడి తండ్రి నంబూరి నాగరాజు(Namboori Nagaraju) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘చిన్నప్పటి నుంచి తిలక్‌కు క్రికెట్ అంటే ఇష్టం.
అందుకని అతడికి ఒక ప్లాస్టిక్ బ్యాట్ కొనిచ్చాం. దాంతో, రోజంతా ఆడుకునేవాడు. చేతిలో ఆ బ్యాటు పట్టుకునే రాత్రి పూట నిద్రపోయేవాడు. కొంచెం పెద్దగా అయ్యాక బ్యాట్, బాల్‌ను పక్కన పెట్టుకొని నిద్రించేటోడు’ అని నాగరాజు తెలిపాడు. అంతేకాదు తిలక్‌కు క్రికెట్లో ఓనమాలు నేర్పిన చిన్నప్పటి కోచ్ గురించి ఏం అన్నాడంటే..? ‘తిలక్ చిన్నప్పటి కోచ్ పేరు సలాం బయాశ్(Salam Bayash). ఆయన మావాడిని బాగా ప్రోత్సహించేవాడు. క్రికెట్ కిట్ అయినా.. లంచ్ బాక్స్ అయినా తిలక్‌కు ఇచ్చేవాడు. అంతేకాదు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. నేను ఉన్నాను అని మాతో అనేవాడు. చెప్పాలంటే మావాడికి గాడ్‌ఫాదర్ అతనే’ అని తిలక్ తండ్రి వెల్లడించాడు.
చిన్నప్పటి కోచ్ సలాం బయాశ్తో తిలక్ వర్మ
దేశవాళీలో పరుగుల వరద పారించిన తిలక్ ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. నిరుడు మినీ వేలంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఈ ఎడమ చేతివాటం బ్యాటర్‌ను రూ. 1.7 కోట్లకు కొన్నది. ఈ సీజన్లో అదరగొట్టిన తిలక్ 16వ సీజన్లో మరింత చెలరేగాడు. 11 మ్యాచుల్లో 343 రన్స్ బాదాడు. దాంతో, భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అందరూ ఊహించినట్టుగానే విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.
తిలక్ వర్మ
నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ అరంగేట్రం మ్యాచ్‌లోనే 39 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. అయితే.. ఆతిథ్య జట్టు 153 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడతాడా? లేదా? చూడాలి.