Tilak Varma | దుబాయ్: ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టిన టీమ్ఇండియా యువ సంచలనం తిలక్ వర్మ (806) ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. తన కెరీర్లో తొలిసారి టాప్-10లోకి వచ్చిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. ఏకంగా 69 ర్యాంక్‌లు ఎగబాకి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడు టీ20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ అయిన ‘నయా 360’ సూర్యకుమార్ యాదవ్(788)ను వెనక్కినెట్టి మూడో ర్యాంక్‌లో నిలవడం గమనార్హం.
ఈ జాబితాలో ట్రావిస్ హెడ్ (855), ఫిల్ సాల్ట్(828) మాత్రమే తిలక్ కంటే ముందున్నారు. సఫారీ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన సంజూ శాంసన్ 17 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని 22వ స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా (244) రెండు ర్యాంక్‌లు ఎగబాకి తిరిగి అగ్రస్థానానికి చేరాడు. బౌలర్ల విషయానికొస్తే భారత్ నుంచి రవి బిష్ణోయ్ (8), అర్ష్‌దీప్ సింగ్ (9) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.