భారత బ్యాటర్లు దుమ్మురేపారు. దక్షిణాఫ్రికా గడ్డపై శతక గర్జన చేశారు. సఫారీలను సొంతగడ్డపై సఫా చేస్తూ రికార్డుల మోత మోగించారు. తిలక్‌వర్మ, శాంసన్ సూపర్ సెంచరీలతో కదంతొక్కిన వేళ వాండర్సర్ స్టేడియం పరుగుల వరదలో తడిసి ముద్దయ్యింది. కొడితే సిక్స్ లేదంటే ఫోర్ అన్న రీతిలో తిలక్, శాంసన్ వీరవిహారం చేశారు. సఫారీ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ బౌండరీల సునామీ సృష్టించారు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో తిలక్ వీరంగం చేస్తే.. శాంసన్ మరోమారు జూలు విదిల్చాడు. వీరిద్దరి బ్యాటింగ్‌కు ధాటికి రికార్డులు దాసోహం కాగా, విదేశీ గడ్డపై టీ20ల్లో భారత్ అత్యుత్తమ స్కోరు అందుకుంది. భారీ లక్ష్యఛేదనలో కంగుతిన్న దక్షిణాఫ్రికా ఓటమి మూటగట్టుకుంది. ఫలితంగా సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుని ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది.
IND Vs SA | జొహాన్నెస్‌బర్గ్: ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌ను భారత్ భారీ విజయంతో ముగించింది. టీ20 ప్రపంచ చాంపియన్‌గా దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా..సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో బరిలోకి దిగిన భారత్ అనుకున్న ఫలితాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌సేన 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుని పొట్టి ఫార్మాట్ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. భారత్ నిర్దేశించిన 284 పరగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 148/10 స్కోరుకు పరిమితమైంది. స్టబ్స్(43) టాప్‌స్కోరర్. అర్ష్‌దీప్‌సింగ్(3/20 ), అక్షర్‌పటేల్(2/6), చక్రవర్తి(2/42) రాణించారు.
తొలుత హైదరాబాదీ తిలక్‌వర్మ(47 బంతుల్లో 120 నాటౌట్, 9ఫోర్లు, 10 సిక్స్‌లు), శాంసన్(56 బంతుల్లో 109 నాటౌట్, 6ఫోర్లు, 9సిక్స్‌లు) సెంచరీలతో భారత్ 20 ఓవర్లలో 283/1 స్కోరు చేసింది. తిలక్, శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సఫారీల బౌలర్లను ఊచకోత కోస్తూ ఇద్దరు సెంచరీలతో విజృంభించారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తిలక్ వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధిస్తే..శాంసన్ తొలి, ఆఖరి పోరులో శతకాలు ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరు టీ20ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లుగా నిలిచారు. తిలక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.
టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ(36), శాంసన్ మెరుగైన ఆరంభాన్నిచ్చారు. ఇన్నిరోజులు ఫామ్‌లేమితో సతమతమైన అభిషేక్ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. శాంసన్ జతగా సఫారీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. సున్నా పరుగుల వద్ద ఔట్ నుంచి బయటపడ్డ అభిషేక్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కొట్జె రెండో ఓవర్లో శాంసన్ సిక్స్, ఫోర్‌తో బౌండరీల మోత మొదలైంది. మరోవైపు అభిషేక్ కూడా బ్యాటు ఝులిపించాడు. సిమ్లెన్ ఐదో ఓవర్లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 24 పరుగులు పిండుకున్నాడు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో అభిషేక్..సింపాల బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా 73/1 స్కోరు చేసింది.
ఇక్కణ్నుంచి అసలు సినిమా మొదలైంది. బ్యాటింగ్ ప్రమోషన్లో మూడో స్థానంలో వచ్చిన తిలక్‌వర్మ వచ్చిరావడంతోనే సఫారీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకపడ్డాడు. మొదట నెమ్మదిగా ఆడిన తిలక్..మహారాజ్ 9వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో తన ఉద్దేశమేంటో చెప్పాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన స్టబ్స్ ఓవర్లో శాంసన్ రెండు సిక్స్‌లు, తిలక్ రెండు ఫోర్లు బాదారు. ఈ క్రమంలో శాంసన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, అగ్నికి ఆజ్యం తోడైనట్లు తిలక్ కూడా జతకలువడంతో స్కోరుబోర్డుకు పరుగులు వరద ఎత్తాయి. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని వీరిద్దరు బౌండరీలతో అభిమానులను అలరించారు.
ఒక దశలో శాంసన్ కొట్టిన బంతిని ఒక మహిళా అభిమానికి బలంగా తాకడంతో ఏడుస్తూ కనిపించింది. మార్క్మ్ 14వ ఓవర్లో తిలక్ వరుస బంతుల్లో 4,6, 6,4తో 22 పరుగులు సాధించాడు. ఒక స్థితిలో శాంసన్ ఆట కొంత మందగించగా, తిలక్ తారాజువ్వలా పేలాడు. కొట్జె 18వ ఓవర్లో శాంసన్ సెంచరీ సాధించగా, ఆ మరుసటి ఓవర్లో తిలక్ శతక నాదం పూరించాడు. మొత్తంగా వీరిద్దరు ఫోర్లు, సిక్స్‌లతో రెండో వికెట్‌కు 210 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇది అత్యుత్తమ భాగస్వామ్యం.
భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. యువ పేసర్ అర్ష్‌దీప్‌సింగ్..సఫారీ టాపార్డర్ భరతం పట్టాడు. అర్ష్‌దీప్ ధాటికి హెండ్రిక్స్ (0), మార్క్మ్(్ర8),క్లాసెన్(0) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. మిడిలార్డర్లో స్టబ్స్ (43), మిల్లర్ (36) పోరాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆఖర్లో జాన్సెన్ (29 నాటౌట్) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
1 ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా శాంసన్ నిలిచాడు.
1 టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి(పూర్తి స్థాయి సభ్యదేశాలు). ఓవరాల్‌గా ది మూడోసారి.
1 టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం(210*).
1 విదేశాల్లో టీ20ల్లో టీమ్ఇండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు(283/1).
2 టీ20ల్లో వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా తిలక్‌వర్మ నిలిచాడు. ఇంతకుముందు శాంసన్ పేరిట ఈ రికార్డు ఉంది.
23 టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌లు
ఫోర్లు: 17,
సిక్స్‌లు: 23
భారత్: 20 ఓవర్లలో 283/1(తిలక్‌వర్మ 120 నాటౌట్, శాంసన్ 109 నాటౌట్, సింపాల 1/58),
దక్షిణాఫ్రికా: 18.2 ఓవర్లలో 148 ఆలౌట్(స్టబ్స్ 43, మిల్లర్ 36, అర్ష్‌దీప్ 3/20, అక్షర్‌పటేల్ 2/6)