పొట్టి ప్రపంచకప్‌నకు ముందు టీమ్ఇండియా చివరి మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టీ20లు నెగ్గి కప్పు ఖరారు చేసుకున్న రోహిత్ సేన.. నేడు మరో మారు సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. నామమాత్ర పోరు కావడంతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చిన టీమ్ఇండియా.. బౌలింగ్ దళాన్ని మరోసారి పరీక్షించనుంది. గత మ్యాచ్‌లో బ్యాటర్లు కొండంత స్కోరు చేసినా.. బౌలర్ల వైఫల్యం చావు తప్పి కన్నులొట్టబోయేలా చేసింది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు లోపాలు సరిదిద్దుకునేందుకు మనవాళ్లకు ఇదే చివరి అవకాశం కాగా.. స్వదేశంలో తొలిసారి దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది!
ఇండోర్: వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా.. పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు చివరి టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 2-0తో సిరీస్ విజయం సాధించిన భారత్.. మంగళవారం మూడో టీ20 ఆడనుంది. గువాహటిలో జరిగిన రెండో పోరులో పరుగుల వరద పారగా.. చిన్న స్టేడియమైన ఇండోర్‌లో అభిమానులను మరో ‘బిగ్ మ్యాచ్’అలరించనుంది. గత మ్యాచ్‌లో రాణించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఈ పోరు నుంచి విశ్రాంతి కల్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు గురువారం ముంబై నుంచి బయలుదేరనుండగా.. కోహ్లీ, రాహుల్ నేరుగా అక్కడే టీమ్‌తో కలువనున్నారు. కోహ్లీ స్థానంలో శ్రేయస్ జట్టులోకి రానుండగా.. పంత్‌కు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించొచ్చు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్‌తో బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేయనుండగా.. మరో అదనపు బ్యాటర్ లేకపోవడంతో షాబాజ్ అహ్మద్‌కు తుది జట్టులో చాన్స్ దక్కొచ్చు. మరోవైపు వరుస మ్యాచ్‌ల్లో ఓడి తొలిసారి భారతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా కనీసం మూడో మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది.
పిచ్, వాతావరణం
ఇండోర్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. మైదానం చిన్నది కావడంతో భారీ స్కోర్లు ఖాయం. రాత్రి అవుతున్నా కొద్ది తేమ పెరగనుంది. టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా లక్ష్య ఛేదనకు మొగ్గు చూపనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), పంత్, శ్రేయస్, సూర్య, అక్షర్, కార్తీక్, షాబాజ్, హర్షల్, దీపక్, అశ్విన్,అర్శ్‌దీప్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రాసో, మార్క్మ్,్ర మిల్లర్, స్టబ్స్, పార్నల్, కేశవ్, రబడ, నోర్జే, ఎంగ్డీ.