ఏటూరునాగారం, అక్టోబర్ 17: ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలకు వేళయింది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉట్నూరు, ఐటీడీఏ తదితర ప్రాంతాలకు చెందిన ప్లేయర్లు ములుగు జిల్లా ఏటూరునాగారానికి చేరుకుంటున్నారు. వీరి కోసం ఐటీడీఏ ప్రత్యేక బస్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. దాదాపు 1668 మంది ప్లేయర్లు టోర్నీలో పోటీపడే అవకాశముంది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీ కోసం ఫిజికల్ డైరెక్టర్లు క్రీడా కోర్టులను సిద్ధం చేశారు. ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అతిథులను సాదరంగా ఆహ్వానించేందుకు స్కౌట్స్ విద్యార్థులు రిహార్సల్స్ చేస్తున్నారు.