Pakistan | ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటి. అటు బెంబేలెత్తించే బ్యాటర్లు, ఇటు బౌలర్లతో ఆ జట్టు ఎప్పుడూ సమతూకంగా ఉంటుంది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ దానికి చక్కని రికార్డులున్నాయి. ఒకప్పుడు ఆ జట్టులో ప్రపంచ దిగ్గజ బౌలర్లు ఇమ్రాన్‌ఖాన్, వాసిం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, ఉమర్‌గుల్ వంటివారితో జట్టు పటిష్టంగా ఉండేది. జట్టు కష్టాల్లో కూరుకుపోయి పరాజయం ఖాయమని నిర్ణయమైపోయిన తర్వాత కూడా జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు అనేకం. మరి ఒక్కసారి ఆ మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దామా!
మెన్ ఇన్ గ్రీన్ ఒకసారి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది. చివరి మ్యాచ్‌కు ముందు రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. సిరీస్ ఫలితం తేల్చే తుది మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు షోయబ్ అక్తర్ చుక్కలు చూపించాడు. 8 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకుని ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో పాక్ 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
అది 1992 ప్రపంచకప్. ఈ టోర్నీలో వాసం అక్రమ్ అద్వితీయ ఆటతీరుతో ఇరగదీసి పాకిస్థాన్ జట్టుకు విలువైన ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా ఫైనల్లో అక్రమ్ అదరహో అనిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 18 బంతుల్లో 33 పరుగులు చేసిన అక్రమ్.. ఆ తర్వాత గేమ్ చేంజర్ స్పెల్‌తో జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. జట్టును విజయం దిశగా నడిపిస్తూ పరుగులు పిండేసుకుంటున్న అలన్లాంబ్ సహా ముగ్గురిని పెవిలియన్ పంపి విజయాన్ని వారి చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఇంగ్లండ్‌ను 22 పరుగులతో ఓడించిన పాకిస్థాన్ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెట్టిన తర్వాత 2020 వరల్డ్ కప్‌ను 2021లో నిర్వహించారు. వాస్తవానికి అది ఇండియాలోనే జరగాల్సి ఉండగా దుబాయ్‌లో నిర్వహించారు. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య జరిగింది. ప్రపంచకప్‌లో ఇండియాపై పాకిస్థాన్ అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. పాక్ బౌలర్ షహాన్ అఫ్రిది బెస్ట్ స్పెల్‌తో టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. పాక్ ఈజీ విక్టరీ సాధించి ప్రపంచకప్‌లో భారత్‌పై గెలవలేమన్న అపోహను తొలగించుకుంది.
2021 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ బౌలింగ్ చిచ్చరపిడుగు హరీశ్ రవూఫ్ చెలరేగిపోయాడు. టాస్ గెలిచి కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించిన పాక్.. హరీశ్ పుణ్యమా అని కివీస్‌ను 134/8 కే కట్టడిచేసింది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన హరీశ్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన పాక్ సెమీస్‌లోకి ప్రవేశించింది.
2017లో భారత్‌తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మొహమ్మద్ ఆమిర్ నిప్పులు చెరిగాడు. ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియాకు అది పెద్ద స్కోరు కానప్పటికీ ఆమిర్ బంతితో నిప్పులు చెరిగి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్‌లను వెంటవెంటనే వెనక్కి పంపి టీమిండియా పరాజయాన్ని శాసించాడు. ఫలితంగా 2017 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది.
వీరే కాకుండా సౌతాఫ్రికా పర్యటనలో ఓ టీ20 మ్యాచ్ ఉమర్గిల్ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకుని జట్టుకు విజయాన్ని కట్టబెట్టగా, 2017లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో హసన్ అలీ 34 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకుని విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2001 నాట్‌వెస్ట్ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వకార్ యూనిస్ 36 పరుగులిచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు.
1987లో ఇంగ్లండ్ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ఇరగదీశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకున్న ఇమ్రాన్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకుని ఇంగ్లిష్ జట్టు పరాజయాన్ని శాసించాడు. 2013లో విండీస్‌లో పర్యటించిన మెన్ ఇన్ గ్రీన్ జట్టు షాహిద్ అఫ్రిది పుణ్యమా అని తొలి వన్డేలో తిరుగులేని విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 224 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్ జట్టుకు షాహిద్ అఫ్రిది చుక్కలు చూపించాడు. బ్యాటింగులో 76 పరుగులు చేసిన అఫ్రిది.. బౌలింగులో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా విండీస్ 41 ఓవర్లలో 98 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌తోపాటు సిరీస్‌ను కూడా పాక్ సొంతం చేసుకుంది.