దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత జట్టు ఆదివారం రాత్రి కటక్ (ఒడిషా) వేదికగా జరుగబోయే రెండో టీ20లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకులు సృష్టించే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ నివేదిక ద్వారా తెలుస్తున్నది. ఆదివారం రాత్రి కటక్ లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు స్థానిక వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ-భువనేశ్వర్) తెలిపింది.
ఆర్ఎంసీ డైరెక్టర్ హెచ్ ఆర్ బిశ్వాస్ మాట్లాడుతూ.. ‘వర్షం పడే ఛాన్స్ 50:50 గా ఉంది. కటక్ లో ఆదివారం సాయంత్రం వర్షం పడదని కచ్చితంగా చెప్పలేం. చిరుజల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. భారీ వర్షాలైతే కురవవు..’ అని తెలిపారు.
అంతేగాక ‘మ్యాచ్ ప్రారంభానికి ముందు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయి. అయితే అది మ్యాచ్ కు రెండు మూడు గంటల ముందు తెలుస్తుంది. కానీ ఆ వర్షం మ్యాచ్ పై ప్రభావం చూపకపోవచ్చు..’ అని అన్నారు. అయితే వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పిచ్, ఔట్ ఫీల్డ్ పాడవకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు ఒడిషా క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
కాగా రెండేండ్ల విరామం తర్వాత కటక్ లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్నది. ఇది స్థానిక క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. శనివారం ప్రాక్టీస్ మ్యాచ్ చూడటానికే వందలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. బీసీసీఐ కూడా దీనిపై స్పందిస్తూ ‘మ్యాచ్ కాని రోజు మ్యాచ్ ని తలపించే జనం. కటక్ లో జన సందోహం..’ అని ట్వీట్ చేసింది. ప్రాక్టీస్ చేస్తున్న భారత ఆటగాళ్ల ఫోటోలను ట్వీట్ లో జతపరిచింది. చివరగా ఇక్కడ 2019 డిసెంబర్ 22న ఇండియా-వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది.
Match day feels on a non-match day. 👌 👌
A packed stadium here in Cuttack to watch #TeamIndia train. 💪#INDvSA | @Paytm pic.twitter.com/lLYwx06Jk3
— BCCI (@BCCI) June 11, 2022