సింగపూర్: సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-9, 14-21, 21-15తో ప్రపంచ రెండో ర్యాంకర్ జోడీ బేక్ హ న- లీ సో హీ(దక్షిణ కొరియా)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. దాదాపు గంట పాటు హోరాహోరీగా సాగిన పోరులో తమ(30వ ర్యాంక్) కంటే మెరుగైన ర్యాంక్‌లో కొరియా జంటను తొలిసారి ఓడించి టోర్నీలో ముందంజ వేశారు. ఎక్కడా తడబాటుకు లోనుకాని గాయత్రి, త్రిసా తొలి గేమ్‌ను అలవోకగా కైవసం చేసుకున్నారు. రెండో గేమ్‌లో పుంజుకున్న కొరియా జోడీ అనూహ్యంగా పోటీలోకి వచ్చింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గాయత్రి, త్రిసా..ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. మరోవైపు అచ్చొచ్చిన సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చుక్కెదురైంది. సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 21-13, 11-21, 20-22తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. కీలక టోర్నీలలో సింధుకు కొరకరాని కొయ్యలా మారిన మారన్.. తొలి గేమ్ ఓడినా తర్వాత పుంజుకుని వరుస గేమ్‌లలో గెలిచి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 13-21, 21-14, 15-21తో కెంటా నిషిమొటో(జపాన్) చేతిలో ఓడాడు.