రోమ్ : నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ ఇటలీకి మళ్లీ షాక్. సాకర్‌ను శ్వాసగా భావించే ఆ దేశంలో ఫుట్‌బాల్ అభిమానులకు మరోసారి గుండెకోతను మిగుల్చుతూ ఇటలీ జట్టు వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఇక్కడ జరిగిన యూరోపియన్ ప్లేఆఫ్స్‌లో ఇటలీ.. 4-1 (1-1)తో తనకంటే తక్కువ ర్యాంకు కల్గిన బోస్నియా అండ్ హెర్జెగొవిన చేతిలో ఓడింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు 1-1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్ ద్వారా నిర్ణయించగా ఇటలీ ఒక్కటంటే ఒక్కటే గోల్ కొట్టగా బోస్నియా 4 గోల్స్ సాధిం చి మెగా టోర్నీకి క్వాలిఫై అయింది.
1934, 1938, 1982, 2006లో ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇటలీ.. 2018 (స్వీడన్ చేతిలో), 2022 (మాసిడోనియాపై) తర్వాత వరుసగా మూడోసారి వరల్డ్ కప్‌నకు క్వాలిఫై కావడంలో విఫలమైంది. 2010, 2014లో వరల్డ్‌కప్‌లో ఆడినా గ్రూప్ స్టేజ్ దాటలేకపోయింది. ఇదిలాఉండగా తాజా ఓటమితో ఇటలీ సాకర్ సమాఖ్య (ఎఫ్ఐజీసీ) అధ్యక్షుడు గ్యాబ్రియెల్ గ్రావినా తన పదవికి రాజీనామా చేశాడు. జాతీయ జట్టు వైఫల్యాన్ని ఇటలీ మీడియా ‘మహా విపత్తు’గా అభివర్ణించింది. ‘గజెట్టా డెల్లొ స్పోర్ట్’ అనే పత్రిక ఈ ఓటమిని ‘ది థర్డ్ అపోకలిప్స్’ (మూడవ విపత్తు)గా రాస్తూ.. ‘ఇకపై దిగ్బ్రాంతికి గురవడం లేదా ఊహించని విపత్తును ఎదుర్కోవడం అనే భావన ఉండదు. ఇది సాధారణమైపోతుంది’ అని పేర్కొంది.